ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌... 18 మంది మావోయిస్టుల మృతదేహాలు స్వాధీనం

  • ఛత్తీస్‌గఢ్‌లో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య భీకర కాల్పులు
  • బీజాపూర్ జిల్లాలో భీకర పోరుల
  • ముగ్గురు డీఆర్‌జీ జవాన్లు కూడా వీరమరణం
  • ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో బుధవారం జరిగిన భీకర ఎన్‌కౌంటర్‌లో 18 మంది మావోయిస్టులు మరణించారు. ఈ భీకర కాల్పుల్లో ముగ్గురు భద్రతా సిబ్బంది కూడా వీరమరణం పొందారు. ఈ ఏడాది బస్తర్ ప్రాంతంలో మావోయిస్టులకు ఇదే అతిపెద్ద నష్టమని అధికారులు భావిస్తున్నారు.

గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశ్‌కుతుల్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉన్నారన్న పక్కా సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టారు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్), సీఆర్పీఎఫ్ కోబ్రా కమాండోలు సంయుక్తంగా కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో భద్రతా దళాలు దీటుగా స్పందించాయి. చాలా గంటల పాటు సాగిన ఈ పోరులో తొలుత 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు ప్రకటించారు. గురువారం ఉదయం ఘటనా స్థలంలో జరిపిన గాలింపు చర్యల్లో మరో ఆరు మృతదేహాలు లభించడంతో మృతుల సంఖ్య 18కి చేరింది.

ఈ పోరాటంలో డీఆర్‌జీకి చెందిన హెడ్ కానిస్టేబుల్ మోను మోహన్ బడ్డి, కానిస్టేబుల్ డుకారు గోండే, జవాన్ రమేశ్ సోడీ కూడా మరణించారు. వారి మృతదేహాలను బీజాపూర్ హెడ్ క్వార్టర్స్‌కు తరలించి, ఉన్నతాధికారులు, తోటి జవాన్లు ఘనంగా నివాళులర్పించారు. ఘటనా స్థలం నుంచి భారీ ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్టు బీజాపూర్ ఎస్పీ జితేంద్ర సింగ్ మీనా తెలిపారు. మృతుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని, సమీప అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు.


More Telugu News