రూ.300 కోట్ల భూవివాదం.. మంత్రి పొంగులేటి కంపెనీపై ఎఫ్ఐఆర్!

  • మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సంస్థపై భూకబ్జా ఆరోపణలు
  • హైదరాబాద్ శివార్లలో రూ.300 కోట్ల విలువైన భూమిపై వివాదం
  • అర్ధరాత్రి జేసీబీలతో ప్రహరీగోడ, గోశాలను కూల్చివేశారని ఫిర్యాదు
  • రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తో పాటు పలువురిపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు
  • ఆరోపణలు నిరాధారం అన్న మంత్రి పొంగులేటి
తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన నిర్మాణ సంస్థపై భారీ భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తాయి. హైదరాబాద్ శివార్లలో రూ.300 కోట్ల విలువైన భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో మంత్రి కుమారుడు హర్షా రెడ్డికి చెందిన రాఘవ కన్‌స్ట్రక్షన్స్ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే... రంగారెడ్డి జిల్లా వట్టినాగులపల్లిలో ఉన్న తమ భూమిని కబ్జా చేసేందుకు నవంబర్ 30వ తేదీ అర్ధరాత్రి ప్రయత్నం జరిగిందని పల్లవి షా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 70 మంది ముసుగులు ధరించిన వ్యక్తులు నాలుగు జేసీబీలతో అక్రమంగా ప్రవేశించి, ఆస్తి చుట్టూ ఉన్న ప్రహరీ గోడను ధ్వంసం చేశారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిని అడ్డుకోబోయిన తమ సిబ్బంది శివ చరణ్, శ్రీను, ధరంపాల్‌పై దాడి చేసి, చట్టవిరుద్ధంగా నిర్బంధించారని తెలిపారు.

భూమికి సంబంధించి జిల్లా కోర్టు, హైకోర్టు నుంచి ఇంజక్షన్ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పినా దుండగులు వినలేదని, స్థలంలోని గోశాలను, సెక్యూరిటీ గార్డు టెంట్‌ను కూడా కూల్చివేశారని బాధితురాలు ఆరోపించారు. దుండగులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్ పేరు చెప్పినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

పల్లవి షా ఫిర్యాదు మేరకు పోలీసులు రాఘవ కన్‌స్ట్రక్షన్స్, న్యూజెన్ బిల్డర్స్ సంస్థలతో పాటు సుధీర్ షా, ప్రశాంత్ తదితరులపై అక్రమ చొరబాటు, దాడి, అక్రమ నిర్బంధం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అయితే, ఈ ఆరోపణలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఖండించారు. తన కుటుంబ సంస్థపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేశారు. ఇది ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న భూవివాదమని, దీనితో తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు.


More Telugu News