నిర్ణయాత్మక వన్డేకు వేదికైన విశాఖ.. హాట్ కేకుల్లా అమ్ముడైన టికెట్లు

  • ప్రస్తుతం 1-1 తో సిరీస్ సమం   
  • విశాఖలో భారత్, సఫారీల మధ్య ఫైనల్ పోరు
  • సిరీస్‌పై కన్నేసిన భారత్, దక్షిణాఫ్రికా
సాగర తీర నగరం విశాఖపట్నంలో క్రికెట్ సందడి మొదలైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరగనున్న నిర్ణయాత్మక మూడో వన్డేకు నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక్కడి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో శనివారం (డిసెంబర్ 6) మధ్యాహ్నం 1:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌తో వన్డే సిరీస్ విజేత ఎవరో తేలిపోనుండటంతో అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుతం మూడు వన్డేల సిరీస్ 1-1తో సమంగా ఉంది. రాంచీలో జరిగిన తొలి వన్డేలో టీమిండియా గెలవగా, రాయ్‌పుర్‌లో జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా విజయం సాధించి సిరీస్‌ను సమం చేసింది. దీంతో వైజాగ్‌లో జరిగే ఆఖరి మ్యాచ్ ఇరు జట్లకు కీలకంగా మారింది. సిరీస్ డిసైడర్ కావడంతో మ్యాచ్ టికెట్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టిన కొద్దిసేపటికే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లు సమాచారం.

ఐపీఎల్ 2025 తర్వాత చాలా కాలానికి విశాఖలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతుండటంతో క్రికెట్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, రాయ్‌పూర్ నుంచి ఇరు జట్ల ఆటగాళ్లు గురువారం సాయంత్రానికి ప్రత్యేక విమానంలో విశాఖకు చేరుకోనున్నారు. వీరి రాకతో నగరంలో క్రికెట్ వాతావరణం మరింత వేడెక్కనుంది.


More Telugu News