అమరావతిలో జాతీయ ఏకలవ్య కళా ఉత్సవాలు.. చదువుతో పాటు సంస్కృతి ముఖ్యమన్న కేంద్ర మంత్రి

  • అమరావతిలో ఏకలవ్య మోడల్ స్కూల్స్ జాతీయ ఉత్సవాలు ప్రారంభం
  • నవోదయ స్కూళ్ల తరహాలో ఈఎంఆర్‌ఎస్‌లను అభివృద్ధి చేస్తామని వెల్లడి
  • ఏపీకి మరిన్ని నిధులు, పాఠశాలలు కేటాయించాలని కోరిన మంత్రి సంధ్యారాణి
గిరిజన విద్యార్థులు కేవలం చదువుకే పరిమితం కాకుండా తమ సంస్కృతి, సంప్రదాయాలను కూడా నేర్చుకోవాలని కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరమ్ అన్నారు. అమరావతిలోని కేఎల్ యూనివర్సిటీ వేదికగా ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (ఈఎంఆర్‌ఎస్‌) ఆరో జాతీయ కల్చరల్, లిటరరీ ఫెస్ట్ 'ఉద్భవ్-2025'ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఏకలవ్య స్కూళ్ల విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
 
జవహర్ నవోదయ, కేంద్రీయ విద్యాలయాల తరహాలోనే ఏకలవ్య పాఠశాలలను కూడా అభివృద్ధి చేస్తామని ఓరమ్ హామీ ఇచ్చారు. విద్యార్థులకు హిందీ, ఆంగ్లంతో పాటు ప్రాంతీయ భాషలపై పట్టు సాధించడం కూడా ముఖ్యమని సూచించారు. క్రీడల్లోనూ గిరిజన విద్యార్థులు రాణిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న ఏపీ ప్రభుత్వం, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, అధికారులను ఆయన అభినందించారు.
 
ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ, 'ఉద్భవ్' అనేది కేవలం వేడుక కాదని, గొప్ప మార్పునకు వేదికని అభివర్ణించారు. దేశవ్యాప్తంగా 405 పాఠశాలల నుంచి 1,647 మంది విద్యార్థులు ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నారని, వారిలో 110 మంది ఏపీ విద్యార్థులు ఉన్నారని తెలిపారు. రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం, పాఠశాలలకు మరిన్ని నిధులు, కొత్త ఈఎంఆర్‌ఎస్‌ స్కూళ్లు మంజూరు చేయాలని ఆమె కేంద్రమంత్రిని కోరారు.
 
అంతకుముందు, విద్యార్థులు గిరిజన సంప్రదాయ నృత్యాలతో కేంద్రమంత్రికి ఘన స్వాగతం పలికారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన గిరిజన సంస్కృతి ప్రదర్శనను ఆయన ఆసక్తిగా తిలకించి, సరదాగా బాణం ఎక్కుపెట్టారు.


More Telugu News