ప్రముఖ సినీ నిర్మాత ఏవీఎం శరవణన్‌ కన్నుమూత

  • తండ్రి ఏవీ మేయప్పన్‌ వారసుడిగా చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించిన శరవణన్
  • ఏవీఎం బ్యానర్‌పై 176 చిత్రాలు నిర్మించిన ఘనత
  • రజనీకాంత్‌, కమల్‌ హాసన్‌ వంటి అగ్రతారలతో సినిమాలు
దక్షిణాది చిత్రసీమకు చిరునామాగా నిలిచిన ఏవీఎం ప్రొడక్షన్స్ అధినేత, ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ (85) కన్నుమూశారు. ఆయన మరణంతో తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలు దిగ్భ్రాంతికి లోనయ్యాయి.

ఏవీఎం ప్రొడక్షన్స్ వ్యవస్థాపకుడు ఏవీ మేయప్పన్ కుమారుడైన శరవణన్, తండ్రి మరణానంతరం నిర్మాణ సంస్థ బాధ్యతలను స్వీకరించి విజయవంతంగా ముందుకు నడిపించారు. ఎంజీఆర్, శివాజీ గణేశన్ నుంచి రజనీకాంత్, కమల్ హాసన్ వంటి అగ్రశ్రేణి నటులతో ఎన్నో ప్రతిష్ఠాత్మక చిత్రాలను నిర్మించారు. ఏవీఎం బ్యానర్‌పై వివిధ భాషల్లో సుమారు 176 సినిమాలను ఆయన నిర్మించారు.

తెలుగులో "సంసారం ఒక చదరంగం", "లీడర్", "జెమినీ" వంటి హిట్ చిత్రాలతో పాటు తమిళంలో "శివాజీ", "మెరుపు కలలు" వంటి బ్లాక్‌బస్టర్‌లను ఆయన అందించారు. సినిమాలే కాకుండా తెలుగు, తమిళం, మలయాళంలో పలు సీరియళ్లను కూడా నిర్మించారు. 2014లో వచ్చిన "ఇదువుమ్ కదాందు పొగుమ్" ఈ బ్యానర్‌లో వచ్చిన చివరి చిత్రం. ఆ తర్వాత 2022లో అరుణ్ విజయ్ హీరోగా "తమిళ్‌రాకర్స్" అనే వెబ్‌సిరీస్‌ను నిర్మించారు.

శరవణన్ కుమారుడు ఎంఎస్ గుహన్ కూడా నిర్మాతగా కొనసాగుతున్నారు. శరవణన్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 


More Telugu News