రాయ్‌పూర్‌లో పరుగుల వరద.. శతక్కొట్టిన కోహ్లీ, రుతురాజ్.. దక్షిణాఫ్రికాకు భారీ లక్ష్యం

  • దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో సెంచరీల మోత
  • రికార్డు స్థాయిలో 53వ శతకం బాదిన విరాట్ కోహ్లీ
  • తొలి వన్డే సెంచరీ నమోదు చేసిన రుతురాజ్ గైక్వాడ్
  • చివర్లో మెరుపులు మెరిపించిన కెప్టెన్‌ కేఎల్ రాహుల్
  • దక్షిణాఫ్రికా ముందు 359 పరుగుల భారీ లక్ష్యం 
రాయ్‌పూర్‌లో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బ్యాటర్లు పరుగుల వరద పారించారు. విరాట్ కోహ్లీ (102) తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంటూ 53వ వన్డే సెంచరీ సాధించగా, యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ (105) తన కెరీర్‌లో తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శనకు కేఎల్ రాహుల్ మెరుపు ఇన్నింగ్స్ తోడవడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.

టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్‌కి దిగిన‌ భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ తక్కువ స్కోర్లకే పెవిలియన్ చేరడంతో 62 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులో నిలిచిన విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్ భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. దక్షిణాఫ్రికా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ మూడో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.

శతకాలు పూర్తి చేసుకున్న తర్వాత వీరిద్దరూ స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. చివర్లో కేఎల్ రాహుల్ దూకుడును ప్రదర్శించాడు. కేవలం 43 బంతుల్లోనే 66 పరుగులు చేసి అజేయంగా నిలవడంతో భారత స్కోరు 350 మార్కును దాటింది. స‌ఫారీ బౌల‌ర్ల‌లో మార్కో య‌న్సెస్ 2 వికెట్లు ప‌డ‌గొట్ట‌గా... ఎంగిడి, బ‌ర్గ‌ర్ త‌లో వికెట్ తీశారు. ఈ మ్యాచ్ గెలవాలంటే దక్షిణాఫ్రికా 359 పరుగులు చేయాలి. మూడు వ‌న్డేల సిరీస్‌లో ఇప్ప‌టికే భార‌త్ మొద‌టి వ‌న్డేలో గెలిచి 1-0తో ఆధిక్యంలో ఉన్న విష‌యం తెలిసిందే. 


More Telugu News