రాయ్‌పూర్‌లో కోహ్లీ, గైక్వాడ్ శతకాలు.. భారీ స్కోరు దిశ‌గా భారత్

  • దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో విరాట్ కోహ్లీ సెంచరీ
  • వన్డే కెరీర్‌లో కోహ్లీకి ఇది 53వ శతకం
  • శతకంతో రాణించిన రుతురాజ్ గైక్వాడ్
  • కోహ్లీ, గైక్వాడ్ మధ్య 195 పరుగుల భారీ భాగస్వామ్యం
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన పరుగుల దాహాన్ని మరోసారి తీర్చుకున్నాడు. దక్షిణాఫ్రికాతో రాయ్‌పూర్‌లో జరుగుతున్న రెండో వన్డేలో అద్భుతమైన సెంచరీ సాధించాడు. వన్డే ఫార్మాట్‌లో కోహ్లీకి ఇది 53వ శతకం. తద్వారా వన్డేల్లో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాడిగా తన రికార్డును మరింత పదిలం చేసుకున్నాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి మొద‌ట‌ బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ త్వరగా పెవిలియన్ చేరారు. దీంతో భారత్ 62 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. ఈ క్లిష్ట సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, మరో యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు.

రుతురాజ్ గైక్వాడ్ కూడా సెంచరీతో (105) రాణించాడు. ఇది అత‌నికి అంత‌ర్జాతీయ వ‌న్డేల్లో తొలి శ‌త‌కం. వీరిద్దరూ కలిసి మూడో వికెట్‌కు 195 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ అద్భుతమైన భాగస్వామ్యంతో భారత జట్టు పటిష్ఠ‌ స్థితికి చేరింది. ఆరంభంలో వికెట్లు తీసి పైచేయి సాధించిన దక్షిణాఫ్రికాకు కోహ్లీ, గైక్వాడ్ జోడీ దెబ్బకు దిమ్మ తిరిగింది. ఈ క్ర‌మంలో 102 ప‌రుగులు చేసిన విరాట్‌.. ఎంగిడి బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 40 ఓవ‌ర్లు ముగిసేస‌రికి భార‌త్ స్కోర్ 4 వికెట్ల న‌ష్టానికి 284 ప‌రుగుల‌కు చేరింది. 


More Telugu News