వ్యవసాయ రంగం బలోపేతానికి పంచసూత్రాలు.. గత పాలనను సరిదిద్దుతాం: సీఎం చంద్రబాబు

  • 'రైతన్నా.. మీ కోసం' సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం
  • అధికారంలోకి వచ్చాక అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించిన సీఎం
  • సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని రోడ్లపై గుంతలు ఉండవని వెల్లడి
  • ఏపీ వ్యవసాయ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యమ‌న్న చంద్ర‌బాబు
ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసి, రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఇందుకోసం 'పంచసూత్రాల'ను అమలు చేస్తున్నామని, ప్రతి రైతు వీటిని ఆచరించి లబ్ధి పొందాలని పిలుపునిచ్చారు. 'రైతన్నా... మీ కోసం' సభలో ప్రసంగించిన ఆయన, గత ప్రభుత్వ విధానాల వల్ల రాష్ట్రం అన్ని రంగాల్లో విధ్వంసానికి గురైందని, రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని విమర్శించారు.

గత ఐదేళ్లలో జరిగిన భూ అవకతవకలను, ల్యాండ్ గోల్మాల్‌ను సరిదిద్దడంపై ప్రత్యేక దృష్టి సారించానని చంద్రబాబు తెలిపారు. తమకు నచ్చిన భూములు ఇవ్వని వారిని 22-ఏ జాబితాలో పెట్టి వేధించారని, వాటన్నింటినీ చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నామని హామీ ఇచ్చారు. నాటి ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజలు చరిత్రాత్మక తీర్పు ఇచ్చారని, పవన్ కల్యాణ్, బీజేపీతో కలిసి కూటమి ఏర్పడిందని గుర్తుచేశారు.

అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన హామీల మేరకు సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు. స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, దివ్యాంగులకు పెంచిన పింఛన్లు, దీపం-2.0 కింద మూడు ఉచిత సిలిండర్లు వంటి పథకాలను వివరించారు. సంక్రాంతి నాటికి రాష్ట్రంలోని రోడ్లపై ఒక్క గుంత కూడా లేకుండా చేస్తామని భరోసా ఇచ్చారు.

వ్యవసాయమే రాష్ట్రానికి బలమని, పోలవరం పూర్తిచేసి, నదుల అనుసంధానం ద్వారా ప్రతి ఎకరాకు నీరందిస్తామని చెప్పారు. మారుతున్న ఆహారపు అలవాట్లకు అనుగుణంగా రైతులు పంటల సరళిని మార్చుకోవాలని, అంతర పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఏపీ వ్యవసాయ ఉత్పత్తులను గ్లోబల్ బ్రాండ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఆయన స్పష్టం చేశారు.



More Telugu News