ఐఎండీబీ 2025 పాప్యులర్ స్టార్స్: జాబితాలో టాలీవుడ్‌కు నిరాశ.. టాప్‌లో బాలీవుడ్ కుర్రాళ్లు!

  • ఐఎండీబీ 2025 పాప్యులర్ తారల జాబితా విడుదల
  • టాప్ 10లో ఒక్క తెలుగు నటుడికీ దక్కని చోటు
  • 'సైయారా' నటులు అహన్ పాండే, అనిత్ పడ్డాకు తొలి రెండు స్థానాలు
  • ఆరో స్థానంలో నిలిచిన రష్మిక మందన్న
  • జాబితాలో చోటు దక్కించుకున్న సీనియ‌ర్లు ఆమిర్ ఖాన్, రిషబ్ శెట్టి
సినిమా రేటింగ్స్, రివ్యూలకు అత్యంత ప్రామాణిక వేదికగా భావించే ఇంటర్నెట్ మూవీ డేటా బేస్ (ఐఎండీబీ) ఈ ఏడాదికి గాను మోస్ట్ పాప్యులర్ భారతీయ తారల జాబితాను విడుదల చేసింది. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా విడుదలైన ఈ లిస్ట్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, ఈ జాబితాలో తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి ఒక్క నటుడికి కూడా స్థానం లభించకపోవడం గమనార్హం.

ఐఎండీబీ విడుదల చేసిన వివరాల ప్రకారం ఈ ఏడాది పాప్యులర్ స్టార్స్ జాబితాలో 'సైయారా' సినిమాతో విజయం అందుకున్న బాలీవుడ్ యువ నటులు అహన్ పాండే, అనిత్ పడ్డా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. 'కూలీ' చిత్రంలో ప్రత్యేక పాత్రలో కనిపించిన అగ్ర నటుడు ఆమిర్ ఖాన్ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. 'హోమ్ బౌండ్' సినిమాతో మెప్పించిన ఇషాన్ ఖట్టర్ నాలుగో స్థానంలో, 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్' ఫేమ్ లక్ష్య ఐదో స్థానంలో నిలిచారు.

ఇక దక్షిణాది నుంచి రష్మిక మందన్న ఆరో స్థానంలో నిలవగా, 'లోక' చిత్రంతో ఆకట్టుకున్న కళ్యాణి ప్రియదర్శన్ ఏడో స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 'ధడక్' సినిమా నటనకు గాను తృప్తి డిమ్రీ ఎనిమిదో స్థానం, రుక్మిణి వసంత్ తొమ్మిదో స్థానం, కన్నడ నటుడు రిషబ్ శెట్టి పదో స్థానంలో నిలిచారు.




More Telugu News