క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో ట్రంప్.. వీడియోపై దుమారం

  • క్యాబినెట్ మీటింగ్‌లో నిద్రమత్తులో కనిపించిన డొనాల్డ్ ట్రంప్
  • తాను చాలా చురుగ్గా ఉన్నానని చెప్పిన కొద్దిసేపటికే ఈ ఘటన
  • వివిధ మంత్రులు మాట్లాడుతుండగా కళ్లు మూసుకున్న అధ్యక్షుడు
  • ట్రంప్ శ్రద్ధగా విన్నారంటూ వైట్‌హౌస్ వివరణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన ఆరోగ్యం విషయంలో వార్తల్లో నిలిచారు. నిన్న‌ వైట్‌హౌస్‌లో జరిగిన సుదీర్ఘ క్యాబినెట్ సమావేశంలో ఆయన నిద్రమత్తులో జోగుతున్నట్టు కనిపించడం చర్చనీయాంశంగా మారింది. తాను "25 ఏళ్ల క్రితం కన్నా ఎంతో చురుగ్గా ఉన్నానని" మీడియా ముందు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ప్రారంభంలో తన ఆరోగ్యంపై వస్తున్న కథనాలను ట్రంప్ తీవ్రంగా ఖండించారు. అయితే, మీటింగ్ మొదలైన 15 నిమిషాల నుంచే ఆయన కళ్లు మూతలు పడుతున్నట్లు కనిపించారు. పలువురు క్యాబినెట్ మంత్రులు తమ శాఖల పనితీరును వివరిస్తుండగా, ట్రంప్ పలుమార్లు 10 నుంచి 15 సెకన్ల పాటు కళ్లు మూసుకుని కునుకు తీస్తున్నట్లు వీడియో ఫుటేజీలో రికార్డయింది. విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఆయన పక్కనే కూర్చుని మాట్లాడుతున్నప్పుడు కూడా ట్రంప్ నిద్రమత్తులోనే ఉన్నారు.

ఆరోపణలను తోసిపుచ్చిన వైట్‌హౌస్ 
అయితే, ఈ ఆరోపణలను వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లెవిట్ తోసిపుచ్చారు. అధ్యక్షుడు ట్రంప్ సమావేశాన్ని ఎంతో శ్రద్ధగా వింటున్నారని, మొత్తం మీటింగ్‌ను ఆయనే నడిపించారని ఆమె స్పష్టం చేశారు. సమావేశం చివర్లో విలేకరుల ప్రశ్నలకు ఆయన దీటుగా సమాధానాలు చెప్పడమే ఇందుకు నిదర్శనమని ఆమె అన్నారు.

ఇటీవలి కాలంలో 79 ఏళ్ల ట్రంప్ ఆరోగ్యంపై తరచూ వార్తలు వస్తున్నాయి. ఆయన 'క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ' (CVI) అనే రక్తనాళాల సమస్యతో బాధపడుతున్నట్లు వైట్‌హౌస్ గతంలో వెల్లడించింది. అయితే, అక్టోబర్‌లో జరిపిన వైద్య పరీక్షల అనంతరం ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని వైద్యులు ధ్రువీకరించారు.


More Telugu News