దివ్యాంగుడిపై రైల్వే పోలీసు కర్కశత్వం.. వీడియో ఇదిగో!

  • ప్లాట్ ఫాంపై పడుకున్న దివ్యాంగుడిని చితకబాదిన రైల్వే పోలీసు
  • కాళ్లతో తన్నుతూ పిడిగుద్దులు కురిపించిన వైనం
  • మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లా నగ్డా రైల్వే స్టేషన్ లో ఘటన
  • రైల్వే పోలీసు తీరుపై తీవ్రంగా మండిపడుతున్న నెటిజన్లు
ప్లాట్ ఫాంపై పడుకున్న ఓ దివ్యాంగుడిపట్ల రైల్వే పోలీసు కర్కశంగా ప్రవర్తించాడు. కాళ్లతో తన్నడంతో పాటు పిడిగుద్దులు కురిపించాడు. బాధతో కేకలు వేస్తున్నా ఆగకుండా కొడుతూనే ఉన్నాడు. ఉజ్జయిని జిల్లా నగ్డా రైల్వే స్టేషన్ లో చోటుచేసుకున్న ఈ ఘటనను ఓ ప్రయాణికుడు తన ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. రైల్వే పోలీసు కర్కశత్వంపై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.

నగ్డా రైల్వే స్టేషన్ లో ప్లాట్ ఫాంపై ఓ దివ్యాంగుడు పడుకున్నాడు. ఇంతలో అటువైపు వచ్చిన ఆర్పీఎఫ్ హెడ్ కానిస్టేబుల్ మాన్ సింగ్ ఆ దివ్యాంగుడిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. యూనిఫాంలో లేకున్నా మాన్ సింగ్ దురుసుగా ప్రవర్తించాడు. కాళ్లతో తన్నుతూ అక్కడి నుంచి తరిమేశాడు. మాన్ సింగ్ చేతిలో దెబ్బలు తిన్న బాధితుడు కన్నీటితో తన బ్యాగు తీసుకుని కుంటుకుంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

అక్కడే ఉన్న ఓ ప్రయాణికుడు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ విషయం ఉన్నతాధికారులకు చేరడంతో మాన్ సింగ్ ను అప్పటికప్పుడే సస్పెండ్ చేశారు. ఇండోర్ లోని రైల్వే పోలీస్ లైన్ కు మాన్ సింగ్ ను అటాచ్ చేశారు. అనుమతి లేకుండా హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లొద్దని ఆదేశించారు. కాగా, ఈ ఘటనపై మాన్ సింగ్ వివరణ ఇస్తూ తన చర్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశాడు. ఆ దివ్యాంగుడు మద్యం మత్తులో ఉన్నాడని, ప్లాట్ ఫాంపై వచ్చిపోయే వారిని దుర్భాషలాడుతున్నాడని ఆరోపించాడు. ఈ వివరణతో సంతృప్తి చెందని ఉన్నతాధికారులు.. ఘటనపై విచారణకు ఆదేశించారు.


More Telugu News