ముఖ్యమంత్రిపై కేసులను సుమోటోగా ఉపసంహరించుకోవడం దేశ చరిత్రలోనే లేదు: చంద్రబాబుపై బొత్స విమర్శలు

  • జగన్ కట్టిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర చేస్తున్నారన్న బొత్స
  • ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించామని వెల్లడి
  • సీఎంపై కేసుల ఉపసంహరణపై గవర్నర్‌కు, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తామన్న బొత్స
కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబుపై శాసనమండలి విపక్ష నేత, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. గత వైసీపీ ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసేందుకు కుట్ర జరుగుతోందని ఆయన సంచలన ఆరోపణలు చేశారు. పేదలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో వైఎస్ జగన్ 17 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే, వాటిలో ఐదు ఇప్పటికే పనిచేస్తున్నాయని బొత్స గుర్తుచేశారు. ఇప్పుడు ఆ కాలేజీలను పీపీపీ మోడల్‌లో ప్రైవేటుకు కట్టబెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని విమర్శించారు. దీనికి వ్యతిరేకంగా కోటి సంతకాలు సేకరించామని, త్వరలోనే గవర్నర్‌ను కలిసి వాటిని అందజేస్తామని తెలిపారు.
 
ముఖ్యమంత్రి తనపై ఉన్న కేసులను సుమోటోగా ఉపసంహరించుకోవడం దేశ చరిత్రలోనే లేదని బొత్స అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసుల నుంచి బయటపడటం సరికాదని, నిజాయతీపరుడైతే కోర్టుల ద్వారా నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. ఈ విషయంపై గవర్నర్, రాష్ట్రపతికి ఫిర్యాదు చేయడంతో పాటు న్యాయపోరాటానికి కూడా సిద్ధమని స్పష్టం చేశారు.
 
ఇటీవల వచ్చిన తుపానుతో రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం ఆదుకోవడంలో విఫలమైందని బొత్స మండిపడ్డారు. తడిసిన ధాన్యాన్ని సైతం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడల్లా రైతులకు గిట్టుబాటు ధర లభించదని, ఎరువుల కొరత ఏర్పడుతుందని విమర్శించారు.
 
గత 18 నెలల్లో రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, అన్ని రంగాల్లో రాష్ట్రం వెనుకబడి అప్పుల్లో మాత్రం ముందుందని ఆరోపించారు. పవన్ కల్యాణ్ 15 ఏళ్లు కలిసి ఉండాలని కోరుకుంటే సరిపోదని, ప్రజలు కోరుకోవాలని ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వానికి 15 నెలలు కూడా అధికారంలో కొనసాగే హక్కు లేదని బొత్స వ్యాఖ్యానించారు. వ్యవసాయాన్ని దండగ అనే చంద్రబాబుతో రైతులకు మేలు జరగదని, ఆయన సూట్‌బూట్ ధనవంతులకే ప్రాధాన్యతనిస్తారని ఆరోపించారు.


More Telugu News