పవన్ సినిమాలను ఒకరు ఆపాలా? మ్యాట్నీ నుంచి జనాలే చూడడం మానేస్తారు!: పేర్ని నాని సెటైర్

  • కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందన్న పవన్ కల్యాణ్
  • పవన్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి హెచ్చరిక
  • కోమటిరెడ్డి ఒక పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి అంటూ పేర్ని నాని వ్యాఖ్యలు
  • పవన్ సినిమాలను మధ్యాహ్నానికే ఎత్తేస్తారని నాని ఎద్దేవా
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలతో మొదలైన రాజకీయ దుమారం మరింత ముదురుతోంది. తెలంగాణ, ఏపీ నేతల మధ్య మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరగా, ఈ వివాదంపై వైసీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్‌ సినిమాలను ఆడనివ్వబోమని హెచ్చరించిన తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని 'ఒక పిచ్చి సినిమాటోగ్రఫీ మంత్రి' అంటూ అభివర్ణించారు. పవన్ సినిమాలను ఎవరూ ఆపాల్సిన అవసరం లేదని, అవే ఆగిపోతాయని ఎద్దేవా చేశారు.

ఇటీవల రాజోలు పర్యటనలో పవన్ కల్యాణ్.. కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి తగిలిందని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పందిస్తూ, పవన్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, లేకపోతే తెలంగాణలో ఆయన సినిమాలు ఎలా విడుదలవుతాయో చూస్తామని హెచ్చరించారు.

కోమటిరెడ్డి హెచ్చరికలపై పేర్ని నాని తనదైన శైలిలో స్పందించారు. "పవన్ కల్యాణ్ సినిమాను సినిమాటోగ్రఫీ మంత్రి వచ్చి ఆపాలా? ఆయన సినిమా మార్నింగ్ షో పడితే మ్యాట్నీకి ఆడటమే కష్టం. మధ్యాహ్నానికే దాన్ని ఎత్తేస్తారు. అలాంటిది మంత్రి వచ్చి ఆపాల్సిన అవసరం ఏముంది?... జనాలే చూడడడం మానేస్తారు అని పేర్ని నాని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అతడి సినిమా కొనుక్కున్న డిస్ట్రిబ్యూటర్లు బికారులుగా మారిపోయారు అంటూ వ్యాఖ్యానించారు.

ఇదే సందర్భంలో పవన్ నటించిన సినిమా నిర్మాతపై కూడా నాని సంచలన ఆరోపణలు చేశారు. "ఆ సినిమా నిర్మాత ఇప్పటివరకు ప్రభుత్వానికి జీఎస్టీ కూడా కట్టలేదు. అయినా ప్రభుత్వంలో ఉన్న ఒక్క అధికారి కూడా ఇదేంటని ప్రశ్నించలేదు" అని ఆయన విమర్శించారు. మొత్తం మీద, పవన్ చేసిన ఒక్క వ్యాఖ్య ఇప్పుడు రెండు రాష్ట్రాల రాజకీయ నాయకుల మధ్య తీవ్ర మాటల యుద్ధానికి దారితీసింది.


More Telugu News