పవన్ కల్యాణ్ పై తెలంగాణ నేతల ఆగ్రహం... స్పందించిన జనసేన పార్టీ

  •  పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి
  • రాజోలులో పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నేతల ఆగ్రహం
  • సుహృద్భావ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇలాంటి మాటలు వద్దన్న జనసేన
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను వక్రీకరించవద్దని జనసేన పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. రాజోలు నియోజకవర్గంలో పర్యటించిన సమయంలో రైతులతో ముచ్చటిస్తూ చెప్పిన మాటలను వక్రీకరిస్తున్నారని ఆ ప్రకటనలో జనసేన పేర్కొంది. ఇరు రాష్ట్రాల మధ్య సుహృద్భావ వాతావరణం నెలకొన్న తరుణంలో ఇలా మాటలను వక్రీకరించవద్దని విజ్ఞప్తి చేసింది.

ఇటీవల రాజోలు నియోజకవర్గంలో పవన్ కల్యాణ్ తెలంగాణ నాయకుల దిష్టి తగలడం వల్లనే కొబ్బరితోటలు ఎండిపోయాయని వ్యాఖ్యానించారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ తదితరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని తెలంగాణ నాయకుల నుంచి డిమాండ్లు వినిపించాయి. ఈ క్రమంలో జనసేన నుంచి ఈ ప్రకటన వెలువడింది.


More Telugu News