బీమా సొమ్ము కోసం సొంత అన్నను హత్య చేసిన తమ్ముడు

  • కరీంనగర్ జిల్లాలో దారుణం
  • టిప్పర్‌తో ఢీకొట్టి చంపి ప్రమాదంగా చిత్రీకరించిన తమ్ముడు
  • వెంకటేశ్ హత్యకు కుట్ర ప్రణాళికను ఫోన్‌లో వీడియో తీసిన నిందితులు
కరీంనగర్ జిల్లాలో ఒక విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. బీమా సొమ్ము కోసం సొంత అన్ననే తమ్ముడు హత్య చేసిన ఘటన కలకలం రేపింది. రామడుగు మండల కేంద్రంలో ఈ దారుణం జరిగింది.

వివరాల్లోకి వెళితే, గత నెల 29న రామడుగు మండల కేంద్రానికి చెందిన మామిడి వెంకటేశ్ టిప్పర్ ఢీకొని మృతి చెందాడు. అయితే, ఇది ప్రమాదవశాత్తు జరిగిన ఘటనగా అంతా భావించారు.

మట్టి తరలిస్తున్న టిప్పర్ బ్రేక్ డౌన్ కావడంతో వెంకటేశ్ టిప్పర్ ముందు భాగంలో మరమ్మతులు చేస్తుండగా, అతని తమ్ముడు నరేశ్ టిప్పర్‌ను స్టార్ట్ చేసి ముందుకు పోనిచ్చాడు. ఈ ఘటనలో వెంకటేశ్‌ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తండ్రి నర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

పోలీసుల దర్యాప్తులో భాగంగా నిందితుడి ప్రవర్తనపై అనుమానం వచ్చి లోతుగా విచారణ జరిపారు. వెంకటేశ్ హత్యకు సంబంధించిన కుట్ర ప్రణాళికను నిందితులు ఫోన్‌లో వీడియో తీశారు. ఆ వీడియో లభ్యమవడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మృతుడు వెంకటేశ్ పేరు మీద రెండు నెలల్లోనే 10 కంపెనీలలో రూ.4.14 కోట్ల విలువైన బీమా పాలసీలను నరేశ్ తీసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. బీమా సొమ్ము కోసమే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.


More Telugu News