నాకు బహుమతులు, పేరుప్రఖ్యాతులు వద్దు... దయచేసి మా ఇంటిని లాక్కోవద్దు!: అంధుల ప్రపంచకప్ విజేత ఫులా

  • అంధుల టీ20 ప్రపంచకప్ ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఫులా సరన్
  • విజయం తర్వాత ఇంటికి చేరగానే షాక్‌కు గురైన క్రీడాకారిణి
  • ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ అధికారుల నుంచి నోటీసులు
  • తన కుటుంబానికి చిన్న ఇల్లు కేటాయించాలని ప్రభుత్వానికి విన్నపం
  • గెలిచినప్పుడు పొగిడారు.. కష్టాల్లో ఎవరూ తోడు లేరంటూ ఆవేదన
దేశానికి గర్వకారణంగా నిలిచిన ఓ క్రీడాకారిణి తీవ్ర ఆవేదనకు గురవుతోంది. అంధుల టీ20 మహిళల ప్రపంచకప్‌ ఫైనల్‌లో 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'‌గా నిలిచి భారత్‌కు కప్ అందించడంలో కీలక పాత్ర పోషించిన ఒడిశాకు చెందిన 20 ఏళ్ల ఫులా సరన్, ఇప్పుడు తన ఇంటిని కోల్పోయే ప్రమాదం ఎదుర్కొంటోంది. స్వదేశానికి తిరిగి రాగానే ప్రభుత్వం నుంచి ఘన స్వాగతం, రూ. 11 లక్షల నగదు బహుమతి అందుకున్న ఆమెకు, అదే ప్రభుత్వం నుంచి ఊహించని షాక్ తగిలింది.

వారు నివాసం ఉంటున్న ప్రభుత్వ స్థలాన్ని ఖాళీ చేయాలంటూ అధికారులు నోటీసులు జారీ చేయడంతో ఫులా సరన్ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా, సలబనేయి గ్రామంలో ఆమె కుటుంబం ప్రభుత్వ స్థలంలో ఓ చిన్నపాటి గుడిసెలో నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె తన ఆవేదనను వెళ్లగక్కింది. "ప్రపంచకప్ గెలిచి రాగానే జిల్లా కలెక్టర్ మమ్మల్ని చూసి గర్వపడుతున్నానని చెప్పారు. కానీ ఇప్పుడు మా ఇంటిని ఖాళీ చేయమంటున్నారు. మేం ఎక్కడికి వెళ్లాలి? వాళ్లు మమ్మల్ని తొలగిస్తే నా చదువు, నా క్రికెట్ ఆగిపోతాయి" అంటూ ఫులా కన్నీటిపర్యంతమైంది.

ఆమె తల్లిదండ్రులు రోజుకూలీలు. స్థిరమైన ఆదాయం లేని తమ కుటుంబానికి సొంత భూమి లేదని ఆమె వెల్లడించింది. "గెలిచినప్పుడు అందరూ అభినందించారు, సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎవరూ పట్టించుకోవడం లేదు. నాకు పెద్ద బహుమతులు, పేరు ప్రఖ్యాతులు వద్దు. నా కుటుంబం తలదాచుకోవడానికి ఓ చిన్న ఇల్లు కేటాయిస్తే చాలు. ప్రభుత్వం నా విజయాన్ని చూసి గర్వపడింది, ఇప్పుడు దయచేసి మా ఇంటిని లాక్కోవద్దు" అని ఆమె ప్రభుత్వాన్ని వేడుకుంది. ప్రపంచకప్ గెలిచిన తర్వాత ప్రధాని మోదీ తమను అభినందించిన క్షణాలను గుర్తుచేసుకున్న ఫులా, ప్రస్తుతం తన పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తోంది.


More Telugu News