కోహ్లీ, గంభీర్ మధ్య ముదురుతున్న వివాదం.. రంగంలోకి దిగిన బీసీసీఐ!

  • విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు విరాట్ నిరాకరణ
  • తన క్రికెట్ సన్నద్ధత ప్రధానంగా మానసిక పరమైనదని వ్యాఖ్య
  • కోహ్లీ-గంభీర్ మధ్య సయోధ్యకు ప్రయత్నాలు
టీమిండియాలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. త్వరలో ప్రారంభం కానున్న దేశవాళీ వన్డే టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీలో ఆడేందుకు కోహ్లీ నిరాకరించడమే ఈ వివాదానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ పరిణామం భారత డ్రెస్సింగ్ రూమ్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఎన్డీటీవీ కథనం ప్రకారం, రోహిత్ శర్మ ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీకి అందుబాటులో ఉంటానని బీసీసీఐ సెలక్షన్ కమిటీకి స్పష్టం చేశాడు. అయితే, కోహ్లీ మాత్రం ఈ టోర్నీలో పాల్గొనేందుకు విముఖత చూపుతున్నాడు. ఒకే నిబంధన అందరికీ వర్తిస్తుందని, ఒక ఆటగాడికి మినహాయింపు ఎలా ఇస్తామని, మిగతా వారికి ఏం సమాధానం చెప్పాలని బీసీసీఐ వర్గాలు ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అందుబాటులో ఉన్న ఆటగాళ్లందరూ దేశవాళీ క్రికెట్ ఆడాలనే నిబంధనపై గంభీర్, సెలక్టర్లు మొదటి నుంచి పట్టుదలగా ఉన్నారు.

అయితే, తాను ఎక్కువ సన్నద్ధతను నమ్మనని కోహ్లీ భావిస్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే అనంతరం మాట్లాడుతూ.. 'నేను ఎప్పుడూ ఎక్కువ ప్రిపరేషన్‌ను నమ్మను. నా క్రికెట్ అంతా మానసికమైనది. శారీరకంగా కష్టపడతాను, ఫిట్‌నెస్ స్థాయులు బాగుంటే చాలు' అని వ్యాఖ్యానించాడు.

కోహ్లీ, గంభీర్ మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు బీసీసీఐ రంగంలోకి దిగింది. ఇందులో భాగంగా, జాతీయ సెలక్టర్ ప్రజ్ఞాన్ ఓజాను రాయ్‌పూర్‌కు పంపినట్లు తెలుస్తోంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండో వన్డే అక్కడే జరగనుండగా, ఈ సందర్భంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఓజా ప్రయత్నించనున్నాడు. 


More Telugu News