బంతితో విఫలమైనా... బ్యాట్ తో అదరగొట్టిన హార్దిక్ పాండ్యా

  • గాయం నుంచి కోలుకుని బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా
  • సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పంజాబ్‌పై మెరుపు ఇన్నింగ్స్
  • కేవలం 42 బంతుల్లో 77 పరుగులు చేసి బరోడాను గెలిపించిన పాండ్యా
  • ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచిన టీమిండియా ఆల్‌రౌండర్
  • దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ముందు సెలక్టర్ల దృష్టిని ఆకర్షించిన ప్రదర్శన
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకుని ఘనంగా పునరాగమనం చేశాడు. సుమారు మూడు నెలల విరామం తర్వాత బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే విధ్వంసక ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా మంగళవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో బరోడా తరఫున ఆడిన హార్దిక్.. కేవలం 42 బంతుల్లోనే 77 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అతని మెరుపు ఇన్నింగ్స్ కారణంగా 223 పరుగుల భారీ లక్ష్యాన్ని బరోడా సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు హార్దిక్ పాండ్యా బౌలింగ్ లో ఏమంతగా ఆకట్టుకోలేకపోయాడు. 4 ఓవర్లులో 52 పరుగులిచ్చి కేవలం ఒక వికెట్ తీశాడు.

ఆసియా కప్ సూపర్ ఫోర్స్ మ్యాచ్‌లో శ్రీలంకతో తలపడినప్పుడు హార్దిక్ గాయపడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి క్రికెట్‌కు దూరంగా ఉన్న అతను, ఆస్ట్రేలియాతో వన్డే, టీ20 సిరీస్‌లతో పాటు ప్రస్తుతం దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా అందుబాటులో లేకుండా పోయాడు. ఇటీవల బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో కోలుకున్న పాండ్యా, బోర్డు నుంచి ‘రిటర్న్ టు ప్లే’ క్లియరెన్స్ పొందిన తర్వాత తన సోదరుడు కృనాల్ పాండ్యా కెప్టెన్సీలోని బరోడా జట్టుతో కలిశాడు.

ఇక మ్యాచ్ విషయానికొస్తే, మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 222 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో హార్దిక్ పాండ్యా 7 ఫోర్లు, 4 సిక్సర్లతో చెలరేగి మరో ఐదు బంతులు మిగిలి ఉండగానే జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ అద్భుత ప్రదర్శనకు గాను హార్దిక్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది. త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును ప్రకటించనున్న నేపథ్యంలో ఈ ఇన్నింగ్స్ అతని పునరాగమన అవకాశాలను మరింత బలోపేతం చేసింది.


More Telugu News