ఉత్తరప్రదేశ్‌లో అర్ధరాత్రి భారీ ఎన్‌కౌంటర్.. గ్యాంగ్‌స్టర్ హతం

  • షామ్లి జిల్లా, కంద్లా ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఎన్‌కౌంటర్
  • నిందితుడిపై రూ.1.25 లక్షల రివార్డు ఉన్నట్లు అధికారులు వెల్లడి
  • ఎదురు కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు గాయాలు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, షామ్లి జిల్లాలోని కంద్లా ప్రాంతపు దట్టమైన అడవుల్లో అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో బవేరియా గ్యాంగ్ లీడర్ మిథున్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. అతనిపై రూ.1.25 లక్షల రివార్డు ఉందని, ఇతనిపై 20 కేసుల్లో అభియోగాలు ఉన్నాయని వెల్లడించారు. ఝింఝానా ప్రాంతంలో బవేరియా గ్యాంగ్ నేరపూరిత చర్యలకు పాల్పడేందుకు ప్రయత్నిస్తోందని సోమవారం పోలీసులకు సమాచారం అందింది.

సమాచారం ఆధారంగా పోలీసులు, ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఆ గ్యాంగ్ ఉన్న ప్రాంతానికి చేరుకున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి ముఠా సభ్యులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారని, దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో మిథున్ మృతి చెందాడని అధికారులు తెలిపారు. అతని అనుచరుడు ఒకరు తప్పించుకున్నట్లు పేర్కొన్నారు.

ఈ ఘటనలో కానిస్టేబుల్ హరేందర్‌కు బుల్లెట్ గాయాలయ్యాయని, అతన్ని ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నట్లు వెల్లడించారు. హర్యానా, పంజాబ్, ఢిల్లీ, పశ్చిమ ఉత్తర ప్రదేశ్ ప్రాంతాలలో రెండు డజన్లకు పైగా హత్య, దోపిడీ, ఇతర తీవ్రమైన నేరాలలో మిథున్ నిందితుడిగా ఉన్నాడని షామ్లి పోలీసు సూపరింటెండెంట్ ఎన్‌పీ సింగ్ తెలియజేశారు.


More Telugu News