అభిమానులకు షాక్.. ఐపీఎల్ వేలం నుంచి మ్యాక్స్‌వెల్ ఔట్!

  • ఐపీఎల్ 2026 వేలం నుంచి తప్పుకున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్
  • ఈ ఏడాది తన పేరును వేలంలో నమోదు చేసుకోవడం లేదని ప్రకటన
  • ఐపీఎల్ తనకు ఎంతో ఇచ్చిందని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్
  • ఇటీవలే మ్యాక్స్‌వెల్‌ను విడుదల చేసిన పంజాబ్ కింగ్స్ 
  • రస్సెల్, డుప్లెసిస్ తర్వాత ఐపీఎల్‌కు దూరమైన మరో స్టార్ ప్లేయర్
ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఈ నెల‌ 16న జరగనున్న 19వ సీజన్ ఐపీఎల్ మినీ వేలం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఇటీవల పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ అతడిని విడుదల చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఈ మేరకు మ్యాక్స్‌వెల్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేశాడు. "ఐపీఎల్‌లో ఎన్నో మధురమైన జ్ఞాపకాల తర్వాత, ఈ ఏడాది వేలంలో నా పేరును నమోదు చేసుకోకూడదని నిర్ణయించుకున్నాను. ఇది చాలా పెద్ద నిర్ణయం. ఈ లీగ్ నాకు ఇచ్చిన ప్రతీదానికి ఎంతో కృతజ్ఞతతో ఈ నిర్ణయం తీసుకుంటున్నాను" అని పేర్కొన్నాడు.

"ఒక క్రికెటర్‌గా, వ్యక్తిగా నన్ను నేను తీర్చిదిద్దుకోవడంలో ఐపీఎల్ ఎంతో సహాయపడింది. ప్రపంచ స్థాయి ఆటగాళ్లతో ఆడే అవకాశం, గొప్ప ఫ్రాంచైజీలకు ప్రాతినిధ్యం వహించడం నా అదృష్టం. అభిమానుల మద్దతు ఎప్పటికీ మరువలేనిది. ఈ జ్ఞాపకాలు నాతోనే ఉంటాయి. ఇన్నాళ్లు మద్దతు ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. త్వరలో కలుద్దాం" అని మ్యాక్స్‌వెల్ తన పోస్టులో రాసుకొచ్చాడు.

గత 2025 సీజన్‌లో మ్యాక్స్‌వెల్ పంజాబ్ కింగ్స్ తరఫున శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో, రికీ పాంటింగ్ కోచింగ్‌లో ఆడాడు. అయితే టోర్నమెంట్ మధ్యలో గాయం కారణంగా సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఆండ్రీ రస్సెల్ ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించగా, ఫాఫ్ డుప్లెసిస్ పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో ఆడేందుకు ఈ సీజన్‌కు దూరంగా ఉంటున్నాడు. ఇప్పుడు వీరి జాబితాలో మ్యాక్స్‌వెల్ కూడా చేరాడు.




More Telugu News