పుతిన్ భారత పర్యటన: రష్యా నుంచే ఆహారం, నీళ్లు.. చివరికి టాయిలెట్ కూడా!

  • రెండు రోజుల భారత పర్యటనకు రానున్న రష్యా అధ్యక్షుడు  
  • ఆకాశం నుంచే అణుదాడికి ఆదేశాలిచ్చేలా ప్రత్యేక విమానం
  • బుల్లెట్లు, బాంబుల దాడిని తట్టుకునే ఆరస్ సెనెట్ కారులో ప్రయాణం
  • నాలుగంచెల భద్రతా వ్యవస్థతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4, 5 తేదీల్లో భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఆయన భద్రత కోసం ఏర్పాటు చేస్తున్న ఏర్పాట్లు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఆయన తాగే నీరు, తినే ఆహారం మాత్రమే కాదు.. ఉపయోగించే టాయిలెట్‌ను కూడా రష్యా నుంచే ప్రత్యేకంగా తీసుకురానుండటం ఆయన భద్రతా ప్రమాణాల తీవ్రతను తెలియజేస్తోంది.

విదేశీ పర్యటనల్లో పుతిన్ భద్రతను ప్రెసిడెన్షియల్ సెక్యూరిటీ సర్వీస్ పర్యవేక్షిస్తుంది. అధ్యక్షుడి రాకకు నెల రోజుల ముందే ఒక బృందం ఆతిథ్య దేశానికి చేరుకొని, ఆయన బస చేసే హోటల్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేస్తుంది. ఆయన వాడే సబ్బులు, షాంపూల నుంచి టూత్‌పేస్ట్ వరకు అన్నీ రష్యా నుంచే తెచ్చి హోటల్ గదిలో అమర్చుతారు. భద్రతా కారణాల దృష్ట్యా పుతిన్ మొబైల్ ఫోన్ ఉపయోగించరు. అత్యంత సురక్షితమైన కమ్యూనికేషన్ లైన్ ద్వారానే సంభాషణలు జరుపుతారు. ఇందుకోసం ఆయన గదిలోనే ప్రత్యేక టెలిఫోన్ బూత్‌ను ఏర్పాటు చేస్తారు.

పుతిన్ ప్రయాణించే ఇల్యూషిన్‌ ఐఎల్‌-96-300పీయూ విమానాన్ని ‘ఎగిరే క్రెమ్లిన్’ (Flying Kremlin) అని పిలుస్తారు. ఇందులో సమావేశ గదులు, జిమ్, మెడికల్ రూమ్‌తో పాటు అణుదాడికి ఆదేశాలు జారీ చేసే ‘న్యూక్లియర్ కమాండ్ బటన్’ కూడా ఉంటుంది. ఆయన విమానానికి యుద్ధ విమానాలు ఎస్కార్ట్‌గా ఉంటాయి. సాంకేతిక సమస్యలు ఎదురైతే, ప్రత్యామ్నాయంగా మరో విమానాన్ని కూడా వెంట తీసుకువస్తారు.

పర్యటనలో పుతిన్ ప్రయాణించే ‘ఆరస్ సెనెట్’ కారును కూడా రష్యా నుంచే తీసుకొస్తారు. ఈ కారు బుల్లెట్లు, గ్రెనేడ్లు, రసాయన దాడులను సైతం తట్టుకోగలదు. నాలుగు టైర్లు పంక్చర్ అయినా ఆగకుండా ప్రయాణించగలదు. ఇక ఆహారం విషయానికొస్తే, రష్యా నుంచి తెచ్చిన పదార్థాలను ప్రత్యేక చెఫ్‌లు వండుతారు. వండిన ఆహారాన్ని పుతిన్ తినే ముందు పరీక్షించడానికి ఒక మొబైల్ ల్యాబ్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. బహిరంగ కార్యక్రమాల్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించే పుతిన్ చుట్టూ ఎల్లప్పుడూ నాలుగంచెల భద్రతా వలయం ఉంటుంది. 


More Telugu News