: భారత్ లో 10 నిమిషాల డెలివరీపై అమెరికా మహిళా వ్యాపారవేత్త ప్రశంసలు

  • ఇండియా 2030 లో జీవిస్తోందని వ్యాఖ్య
  • అమెరికాలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు.. ఇండియాలో ఏదైనా సరే 10 నిమిషాల్లో డెలివరీ
  • ఝార్ఖండ్ లోని రాంచీలో తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకున్న అమెరికన్ మహిళ
టెక్నాలజీ విషయంలో, అభివృద్ధిలో ఇండియా కన్నా అమెరికా ఎంతో ముందంజలో ఉందనే విషయం అందరికీ తెలిసిందే. అయితే, ఒక్క విషయంలో మాత్రం అమెరికా మన దేశానికి దరిదాపుల్లో కూడా లేదని స్వయంగా ఓ అమెరికా మహిళా వ్యాపారవేత్త వ్యాఖ్యానించారు. వినియోగదారుడికి వస్తువులను చేర్చడంలో భారత్ చాలా చాలా ముందుందని, ఈ విషయంలో భారత్ 2030లో ఉందని పేర్కొంది. శాన్ ఫ్రాన్సిస్కోలో సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు ఉన్నాయి, అదే భారత్ లో మాత్రం ఏదైనా సరే ఆర్డర్ చేసిన 10 నిమిషాల్లో అందుకునే అవకాశం ఉందని తెలిపింది. ఈమేరకు అమెరికాలోని హెల్త్ కేర్ కంపెనీ ‘ట్రైఫెచ్’ సీఈవో వారుణి సర్వాల్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇటీవల భారత పర్యటనకు వచ్చిన వారుణి.. మూడు వారాల పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను సందర్శించారు. ఈ క్రమంలోనే ఝార్ఖండ్ లోని రాంచీలో ఓ వివాహానికి హాజరయ్యారు. వివాహ వేడుకల్లో భాగంగా నిర్వహించిన హల్దీ కార్యక్రమానికి హాజరయ్యేందుకు సరైన దుస్తులు లేవని చివరి నిమిషంలో గుర్తించామని వారుణి తెలిపారు. 

హోటల్ గదిలో ఓవైపు సిద్ధమవుతూ బ్లింకిట్ లో దుస్తులకు ఆర్డర్ పెట్టామని వారుణి చెప్పారు. ఆర్డర్ చేసిన తర్వాత సరిగ్గా పదిహేను నిమిషాల్లో దుస్తులను అందుకోవడం తనను ఆశ్చర్యపరిచిందని ఆమె వివరించారు. ఇదే పరిస్థితి అమెరికాలో ఎదురైతే కారు బుక్ చేసుకుని దగ్గర్లోని మాల్ కు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. ఒకవేళ అమెజాన్ లో ఆర్డర్ పెడితే రెండు రోజుల తర్వాతే మనం ఆర్డర్ చేసిన వస్తువు చేతికి అందుతుందని వారుణి వివరించారు.

More Telugu News