Vijay Mallya: మాల్యా, నీరవ్ మోదీ ఎంత ఎగ్గొట్టారో తెలుసా?.. పార్లమెంటులో కేంద్రం కీలక ప్రకటన

15 Fugitive Economic Offenders Including Vijay Mallya And Nirav Modi Owe Over Rs 58000 Crore Says Government
  • విదేశాలకు పారిపోయిన 15 మంది ఆర్థిక నేరగాళ్లు
  • బ్యాంకులకు రూ.58,082 కోట్ల టోకరా 
  • పార్లమెంటులో వివరాలు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం
  • ఇప్పటివరకు 33 శాతం రికవరీ చేసినట్లు ప్రకటన
  •  రూ.11,960 కోట్లతో మొదటి స్థానంలో విజయ్ మాల్యా 
  • రూ.6,799 కోట్లు బకాయి పడ్డ నీరవ్ మోదీ   
ప్రముఖ వ్యాపారవేత్తలు విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్థిక నేరగాళ్లు ప్రభుత్వ బ్యాంకులకు పెట్టిన టోపీ అంతా ఇంతా కాదు. దేశం విడిచి పారిపోయిన మొత్తం 15 మంది ఆర్థిక నేరస్థులు ప్రభుత్వ బ్యాంకులకు ఏకంగా రూ.58,082 కోట్లు బకాయి పడినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ ఛౌద్రీ లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వకంగా సమాధానమిచ్చారు.

ఈ మొత్తం బకాయిల్లో అసలు మొత్తం రూ.25,645 కోట్లు కాగా, దానిపై వడ్డీ రూ.31,437 కోట్లకు చేరిందని మంత్రి వివరించారు. ఇప్పటివరకు ఈ నేరగాళ్ల ఆస్తుల నుంచి 33 శాతం అంటే రూ.19,187 కోట్లను రికవరీ చేసినట్లు తెలిపారు. ఇంకా రూ.38,895 కోట్లు రాబట్టాల్సి ఉందని చెప్పారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహా మొత్తం 12 ప్రభుత్వ రంగ బ్యాంకులకు వీరు ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంది.

ఈ జాబితాలో కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్ అధినేత విజయ్ మాల్యా రూ.11,960 కోట్లతో మొదటి స్థానంలో ఉన్నారు. ఆయన ఒక్క స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకే ఈ మొత్తం చెల్లించాల్సి ఉంది. ఆయన తర్వాత వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ.. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు రూ.6,799 కోట్లు బకాయి పడ్డారు. వీరితో పాటు సందేశారా గ్రూప్ కూడా రూ.900 కోట్ల నుంచి రూ.1300 కోట్ల వరకు అప్పులు తీసుకున్నట్లు తేలింది.

పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల చట్టం 2018 ప్రకారం వీరిని నేరగాళ్లుగా గుర్తించినట్లు మంత్రి తెలిపారు. అయితే, ఈ 15 మందిలో కేవలం ఇద్దరు మాత్రమే ఏకకాల పరిష్కారం (Single Time Settlement) కోసం చర్చలు జరుపుతున్నారని వెల్లడించారు. 


Vijay Mallya
Nirav Modi
Indian bank defaulters
economic offenders
bank loans recovery
Punjab National Bank
State Bank of India
Kingfisher Airlines
loan defaulters India

More Telugu News