Amar Subramanya: యాపిల్ ఏఐకి కొత్త బాస్.. పగ్గాలు చేపట్టిన భారత సంతతి వ్యక్తి అమర్ సుబ్రమణ్య

Amar Subramanya New Apple AI Head
  • జాన్ జియానాండ్రియా స్థానంలో ఈ కొత్త నియామకం
  • ఏఐ రేసులో వెనుకబడిన నేపథ్యంలో యాపిల్ కీలక నిర్ణయం
  • వచ్చే ఏడాదికి వాయిదా పడిన సిరి ఏఐ అప్‌గ్రేడ్
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విభాగంలో కీలక మార్పులు చేసింది. సంస్థ ఏఐ విభాగానికి అధిపతిగా భారత సంతతికి చెందిన అమర్ సుబ్రమణ్యను నియమించినట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఈ బాధ్యతల్లో ఉన్న జాన్ జియానాండ్రియా స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. యాపిల్ ఫౌండేషన్ ఏఐ మోడల్స్, మెషీన్ లెర్నింగ్ రీసెర్చ్ కార్యకలాపాలను ఇకపై అమర్ పర్యవేక్షించనున్నారు.
 
ఏఐ రంగంలో అమర్ సుబ్రమణ్యకు అపార అనుభవం ఉంది. గతంలో ఆయన మైక్రోసాఫ్ట్‌లో ఏఐ విభాగానికి వైస్ ప్రెసిడెంట్‌గా పనిచేశారు. అంతకుముందు సుమారు 16 ఏళ్ల పాటు గూగుల్‌లో సేవలందించారు. అక్కడ జెమిని అసిస్టెంట్ ఇంజనీరింగ్ విభాగానికి ఆయన నేతృత్వం వహించారు. ఇక, జాన్ జియానాండ్రియా వచ్చే ఏడాది తన పదవీ విరమణ వరకు యాపిల్‌లో సలహాదారుగా కొనసాగుతారు.
 
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో యాపిల్ ప్రస్తుతం వెనుకబడినట్లు టెక్ వర్గాలు భావిస్తున్నాయి. ఐఫోన్లకు ఏఐ ఫీచర్లను జోడించడంలో జాప్యం జరుగుతుండటమే దీనికి కారణం. మరోవైపు, యాపిల్ ప్రధాన ప్రత్యర్థి శాంసంగ్ ఇప్పటికే తన ఫోన్లలో అనేక ఏఐ ఫీచర్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ క్రమంలో, యాపిల్ వాయిస్ అసిస్టెంట్ 'సిరి'కి ఏఐ మెరుగులు దిద్దే ప్రక్రియ కూడా వచ్చే ఏడాదికి వాయిదా పడింది. ఈ నేపథ్యంలోనే యాపిల్ ఈ కీలక నియామకం చేపట్టినట్లు తెలుస్తోంది.
Amar Subramanya
Apple AI
Artificial Intelligence
AI Head
John Giannandrea
Apple Siri
AI Features
Machine Learning
Tech News
Indian Origin

More Telugu News