నాందేడ్‌ పరువు హత్య కేసులో మరో ట్విస్ట్.. ఏడు నెలల క్రితం కూతురి ప్రియుడితో తండ్రి డ్యాన్స్!

  • కుమార్తె ప్రేమను అంగీకరించినట్టు నటించిన కుటుంబ సభ్యులు
  • నాడు కుమార్తె ప్రియుడితో అందరూ కలిసి ఆనందంగా డ్యాన్స్
  • సమయం చూసి దారుణంగా హత్య చేసిన వైనం
ప్రేమను అంగీకరించినట్లే నటించారు. అతనిని తమతో కలుపుకున్నట్లు నాటకమాడారు. ఏడు నెలల క్రితం కూతురి ప్రియుడితో కలిసి ఆనందంగా డ్యాన్స్ చేసిన ఆ తండ్రే.. ఇప్పుడు అతని పాలిట యముడయ్యాడు. పక్కా ప్రణాళికతో, నమ్మించి గొంతుకోసిన ఈ దారుణ పరువు హత్య మహారాష్ట్రలోని నాందేడ్‌లో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ నమ్మకద్రోహానికి కుప్పకూలిన ఆ ప్రియురాలు, తన ప్రియుడి నిర్జీవ దేహానికే తాళి కట్టి, సమాజానికి ఓ నిశ్శబ్ద ప్రశ్నను సంధించింది.

నాందేడ్‌కు చెందిన అంచల్ మామిడ్వార్ (21), అదే ప్రాంతానికి చెందిన సాక్షం టేట్ (20) మూడేళ్లుగా గాఢంగా ప్రేమించుకుంటున్నారు. అయితే, సాక్షం దళిత వర్గానికి చెందినవాడు కావడంతో, అగ్రవర్ణానికి చెందిన అంచల్ కుటుంబం వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలో, ఈ ఏడాది ఏప్రిల్ 14న జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. అంచల్ తండ్రి గజానన్ మామిడ్వార్, ప్రియుడు సాక్షంతో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్ చేశాడు. ఈ వీడియో చూసిన ప్రేమికులు, వారి స్నేహితులు.. ఇక అంతా సవ్యంగానే ఉందని, వారి ప్రేమకు ఆమోదం లభించిందని భావించారు.

కానీ, ఆ డ్యాన్స్ వెనుక దారుణమైన కుట్ర దాగి ఉందని వారు ఊహించలేకపోయారు. గురువారం, అంచల్ సోదరుడు (మైనర్) పథకం ప్రకారం సాక్షంను కలిశాడు. మాటల్లో పెట్టి, తుపాకీతో కాల్చి, అనంతరం టైల్స్‌తో తలపై మోది కిరాతకంగా హతమార్చాడు. ఈ వార్త తెలియగానే అంచల్ కుప్పకూలిపోయింది.

పోలీసులపై సంచలన ఆరోపణలు 
ఈ హత్య కేవలం తన సోదరుడు ఒక్కడే చేయలేదని, దీని వెనుక తన తండ్రి గజానన్, మరో సోదరుడి ప్రమేయం కూడా ఉందని అంచల్ ఆరోపించింది. అంతకంటే ముఖ్యంగా, ఆమె పోలీసులపై చేసిన ఆరోపణలు ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. "హత్యకు కొన్ని గంటల ముందు, నా తమ్ముడిని ఇద్దరు పోలీసులు స్టేషన్‌కు పిలిపించారు. 'వీధిలో వేరేవాళ్లతో గొడవలు పడటం ఎందుకు? ముందు నీ పరువు తీస్తున్న నీ చెల్లి లవర్‌ను చంపెయ్' అని వాళ్లే రెచ్చగొట్టారు" అని అంచల్ ఆరోపించడంతో ఈ కేసు మరో మలుపు తిరిగింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితులపై హత్య, అల్లర్లు సృష్టించడం, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం, ఆయుధాల చట్టం కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి


More Telugu News