ఏపీ శాసనమండలిలో కీలక పరిణామం... రాజీనామా వెనక్కి తీసుకున్న డిప్యూటీ చైర్ పర్సన్ జకియా ఖానమ్

  • మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి ఇటీవల రాజీనామా చేసిన జకియా ఖానమ్
  • పదవీకాలం ఆరు నెలలే ఉన్నందున రాజీనామాతో ప్రయోజనం లేదన్న మండలి చైర్మన్ 
  • ఛైర్మన్ మోషేన్ రాజు సూచనతో నిర్ణయం వాపసు
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖానమ్ తన రాజీనామాను ఉపసంహరించుకున్నారు. మండలి ఛైర్మన్ కోయ్యే మోషేన్ రాజు చేసిన సూచన మేరకు ఆమె సోమవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఆమె తన పదవిలో యథాతథంగా కొనసాగనున్నారు.

కొన్ని రోజుల క్రితం వ్యక్తిగత కారణాలతో జకియా ఖానమ్ తన పదవికి రాజీనామా చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఛైర్మన్ మోషేన్ రాజు ఆమెతో నేరుగా మాట్లాడారు. ఆమె పదవీకాలం మరో ఆరు నెలలు మాత్రమే మిగిలి ఉందని, ఇప్పుడు రాజీనామా చేస్తే కొత్త నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నిక నిర్వహించడానికి సమయం ఉండదని వివరించారు. ఈ తక్కువ కాలానికి రాజీనామా చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, కావున పదవిలో కొనసాగడమే సరైన నిర్ణయమని సలహా ఇచ్చారు.

ఛైర్మన్ సూచనను అంగీకరించిన జకియా ఖానమ్, తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు అధికారికంగా లేఖ అందజేశారు. ఈ లేఖను ఛైర్మన్ మోషేన్ రాజు వెంటనే ఆమోదించారు. ఈ పరిణామంతో జకియా ఖానమ్ తన మిగిలిన ఆరు నెలల పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారు.


More Telugu News