ఢిల్లీ చేరుకున్న ఏపీ మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత

  • ఢిల్లీ పర్యటనకు వెళ్లిన మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత
  • రేపు కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్‌తో భేటీ
  • 'మొంథా' తుఫాను నష్టంపై సమగ్ర నివేదిక అందజేత
  • ఏపీ మంత్రులకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్, హోంమంత్రిగా వంగలపూడి అనిత సోమవారం హస్తినకు వెళ్లారు. ఢిల్లీ విమానాశ్రయంలో వారికి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పలువురు ఎంపీలు, టీడీపీ నేతలు ఘనస్వాగతం పలికారు.

స్వాగతం పలికిన వారిలో ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సానా సతీష్, కేశినేని శివనాథ్, లావు కృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాద్ రావు, పార్థసారథి, అప్పలనాయుడు, బస్తిపాటి నాగరాజు, భరత్, అంబికా లక్ష్మీనారాయణ ఉన్నారు. వీరితో పాటు టీడీపీ సీనియర్ నేతలు కంభంపాటి రామ్మోహన్ రావు, కనకమేడల రవీంద్ర కుమార్ కూడా మంత్రులకు స్వాగతం పలికారు.

ఈ పర్యటనలో భాగంగా మంత్రులు లోకేశ్, అనిత మంగళవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా, వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌లతో వేర్వేరుగా భేటీ కానున్నారు. ఇటీవల రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన 'మొంథా' తుఫాను వల్ల జరిగిన నష్టంపై రూపొందించిన సమగ్ర నివేదికను కేంద్ర మంత్రులకు అందించి, సహాయం కోరనున్నారు. తుపాను ప్రభావం, పంట నష్టం, పునరావాస చర్యలకు అవసరమైన నిధులపై వారు చర్చించనున్నారు.


More Telugu News