Jaishankar: ఉగ్రవాదంపై చర్యలు తీసుకోవాలే కానీ, ఆజ్యం పోయకూడదు: పోలండ్ ఉపప్రధానికి జైశంకర్ చురక

Jaishankar slams soft stance on terrorism to Poland Deputy PM
  • గత ఏడాది పాకిస్థాన్ వెళ్లి కశ్మీర్‌పై ఉమ్మడి ప్రకటన చేసిన పోలండ్ ఉప ప్రధాని
  • ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటుందని జైశంకర్ విమర్శ
  • ఉగ్రవాదంపై మెతక వైఖరిని విడనాడాలని పిలుపు
భారత్‌తో స్నేహ సంబంధాలు కోరుకునే దేశాలు ఉగ్రవాదంపై మెతక వైఖరిని విడనాడాలని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పష్టం చేశారు. పోలండ్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్క్సీతో జరిగిన సమావేశంలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. గత ఏడాది పాకిస్థాన్ పర్యటన సందర్భంగా రాడోస్లావ్ జమ్ము కశ్మీర్‌పై స్పందిస్తూ, కశ్మీర్ సమస్యను సామరస్యంగా పరిష్కరించాలని పాక్ నేతలతో కలిసి ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు.

ఈ నేపథ్యంలో జైశంకర్ స్పందిస్తూ, ఉగ్రవాదాన్ని భారత్ ఎప్పటికీ వ్యతిరేకిస్తూనే ఉంటుందని, కాబట్టి తమ దేశంతో స్నేహం కోరుకునే వారు ఉగ్రవాదంపై మెతక వైఖరిని ప్రదర్శించవద్దని కోరారు. ఉగ్రవాదులు ఎప్పటికైనా ప్రపంచ దేశాలకు ముప్పుగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. సరిహద్దు ఉగ్రవాదం వల్ల భారత్ ఎదుర్కొంటున్న సమస్యల గురించి రాడోస్లావ్‌‌కు తెలుసని అన్నారు.

సరిహద్దు ఉగ్రవాదానికి ఎవరూ ఆజ్యం పోయకూడదని జైశంకర్ హితవు పలికారు. ప్రపంచం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న సమయంలో ప్రత్యేకంగా భారత్‌ను లక్ష్యంగా చేసుకోవడం అన్యాయమని ఆయన అభిప్రాయపడ్డారు. భారత్-పోలండ్ మధ్య సంబంధాలు స్థిరంగా కొనసాగుతున్నాయని, వాటిని కాపాడుకోవడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
Jaishankar
Poland
Radislaw Sikorski
India Poland relations
terrorism
Kashmir
Pakistan
border terrorism

More Telugu News