Nara Lokesh: టీం 11 ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెడతారా?: మంత్రి నారా లోకేశ్

Nara Lokesh Slams AP Team 11 Investment Claims
  • జ్యూరిచ్ లో తెలుగు డయాస్పొరా సమావేశం
  • సీఎం చంద్రబాబుతో పాటు పాల్గొన్న మంత్రి నారా లోకేశ్
  • ఏపీకి రావొద్దని ఏడుపుగొట్టు టీం కంపెనీలకు ఈమెయిల్స్ పెడుతోందని విమర్శలు
  • అర్థమైందా రాజా అంటూ పరోక్ష వ్యాఖ్యలు
"ఏపీలో ఉన్న టీం 11' ముఖం చూసి ఎవరైనా పెట్టుబడులు పెట్టడానికి వస్తారా? అని రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తీవ్రంగా ప్రశ్నించారు. పెట్టుబడుల కోసం తాము ప్రయత్నిస్తుంటే, ఏపీకి రావొద్దని ఆ 'ఏడుపుగొట్టు టీం' కంపెనీలకు ఈ-మెయిల్స్ పెడుతోందని ఆరోపించారు. కోడికత్తి, బాబాయి హత్య, ప్రజాధనంతో ప్యాలెస్ కట్టుకున్న క్రెడిట్ మాత్రమే వారికి దక్కుతుందని ఎద్దేవా చేశారు. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు స్విట్జర్లాండ్ వెళ్లిన ఆయన, జ్యూరిచ్ లో ఏపీఎన్ఆర్టీ ఆధ్వర్యంలో జరిగిన యూరప్ తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం చంద్రబాబుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ, పరోక్ష విమర్శలు గుప్పించారు.

"ఏపీలో టీం 11 ఉంది. అర్థమైందా రాజా? అదో ఏడుపుగొట్టు టీం. పెట్టుబడులు తీసుకువస్తామంటే ఏడుస్తారు. పెట్టుబడుల కోసం సింగపూర్ కు వెళితే.. ఏపీకి రావద్దని ఆ ఏడుపుగొట్టు టీం ఈ-మెయిల్స్ పెట్టే పరిస్థితి. కొన్ని కంపెనీలను కలిస్తే ఏపీకి రావొద్దంటూ వారికి కూడా ఈ-మెయిల్స్ పెడుతున్నారు. సీఎం చంద్రబాబు గారిని చూసి సదరు కంపెనీలు వస్తే మాత్రం క్రెడిట్ తీసుకోవాలనుకుంటారు. మళ్లీ క్రెడిట్ చోరీ అంటారు. టీం 11 ముఖం చూసి ఎవరైనా రాష్ట్రంలో పెట్టబడులు పెట్టడానికి వస్తారా? కోడికత్తికి వారికి క్రెడిట్ ఇవ్వాలి. బాబాయిని లేపేసిన క్రెడిట్ ఇవ్వాలి. చెల్లినీ, తల్లినీ గెంటేసిన క్రెడిట్ ఇవ్వాలి. రూ.700 కోట్ల ప్రజాధనంతో విశాఖలో ప్యాలస్ కట్టుకున్న క్రెడిట్ ఏడుపుగొట్టు టీంకి ఇవ్వాలి" అంటూ లోకేశ్ సెటైర్ల వర్షం కురిపించారు.


గత 18 నెలల్లో ప్రజా ప్రభుత్వం రూ.23.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకుందని, దీని ద్వారా 16 లక్షలకు పైగా ఉద్యోగాలు రాబోతున్నాయని లోకేశ్ తెలిపారు. దేశానికి వచ్చిన మొత్తం పెట్టుబడుల్లో 25.3 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే రావడం గర్వకారణమని, పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉందని అన్నారు.

తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడి, ఢిల్లీని సైతం దద్దరిల్లేలా చేసిన వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని కొనియాడారు. ఆయన తెలుగుదేశం పార్టీని స్థాపించడం వల్లే తెలుగుజాతికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చిందన్నారు. ఎన్టీఆర్ ఆశయాలకు అభివృద్ధిని జోడించి రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి చంద్రబాబు అని లోకేశ్ అన్నారు. గూగుల్, ఆర్సెలార్ మిట్టల్ వంటి దిగ్గజ కంపెనీలు నేడు ఏపీ వైపు చూస్తున్నాయంటే దానికి కారణం 'బ్రాండ్ సీబీఎన్' అని స్పష్టం చేశారు.

సీఎం చంద్రబాబుకు ఉన్న విజన్ కారణంగా ఆయన్ను ఏ విషయంలో అయినా గుడ్డిగా అనుసరించవచ్చని లోకేశ్ అన్నారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కొందరు విమర్శిస్తారని, కానీ భవిష్యత్తులో అవే అభివృద్ధి ఫలాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తమకు జీపీఎస్ లాంటివారని, ఆయన నాయకత్వంలో తామంతా ఒక యంగ్ టీంగా ఎటువంటి ఈగోలు లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. ఆయన విజన్ సాధన కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామన్నారు.

'బ్రాండ్ సీబీఎన్', 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్', ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలోని 'డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కార్' వల్లే కంపెనీలు ఏపీకి క్యూ కడుతున్నాయని వివరించారు. గుజరాత్, ఒడిశా మాదిరిగా రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రభుత్వ కొనసాగింపు చాలా ముఖ్యమని లోకేశ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రభుత్వం కనీసం 15 ఏళ్లు కొనసాగాలని ఆకాంక్షించారు.

ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి, సంక్షేమం జోడెద్దుల బండిలా సాగుతున్నాయని, డీఎస్సీ పూర్తి చేయడం, కానిస్టేబుల్ ఉద్యోగాలు కల్పించడం వంటి హామీలను నిలబెట్టుకున్నామని తెలిపారు.

ఒకే రాజధాని అమరావతి, అభివృద్ధి వికేంద్రీకరణ తమ ప్రభుత్వ అజెండా అని స్పష్టం చేశారు. చిత్తూరు-కడపను ఎలక్ట్రానిక్స్ హబ్‌గా, కర్నూలును రెన్యువబుల్ ఎనర్జీ హబ్‌గా, ఉత్తరాంధ్రను ఫార్మా, ఐటీ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారంతా ఆంధ్రప్రదేశ్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మారి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని లేదా తాము పనిచేస్తున్న కంపెనీలను ఏపీకి తీసుకురావాలని లోకేశ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి టీజీ భరత్, ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు డా. వేమూరు రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Nara Lokesh
AP Team 11
Andhra Pradesh investments
Chandrababu Naidu
APNRT
Davos World Economic Forum
Brand CBN
AP development
Telugu diaspora
Andhra Pradesh economy

More Telugu News