ఎక్కువసేపు మొబైల్ చూడకుంటే బహుమతి.. పంజాబ్‌లో ఆసక్తికర పోటీ

మోగా జిల్లాలోని గోలియా ఖుర్ద్ గ్రామంలో వినూత్న పోటీ
మొబైల్ లేకుండా ఎక్కువసేపు ఒకేచోట కూర్చుంటే బహుమతి
పోటీలో పాల్గొంటున్న 55 మంది గ్రామస్తులు
పంజాబ్ రాష్ట్రంలోని మోగా జిల్లాలో ఒక ఆసక్తికరమైన పోటీని నిర్వహిస్తున్నారు. మొబైల్ ఫోన్ చూడకుండా ఎక్కువసేపు నిలిచిన వారికి బహుమతులు ఇస్తామని ఆ జిల్లాలోని గోలియా ఖుర్ద్ గ్రామ పెద్దలు ప్రకటించారు. ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఫోన్ లేకుండా ఉండలేకపోతున్నారు. మొబైల్ ఫోన్ శరీరంలో ఒక భాగంగా మారిన ఈ తరుణంలో, ఫోన్ లేకుండా ఎక్కువసేపు ఉన్న వారికి బహుమతులు ప్రకటిస్తూ సరికొత్త పోటీకి శ్రీకారం చుట్టారు.

భార్యాభర్తలు, అత్తమామలు, మనవరాళ్లు, యువకులు, వృద్ధులు.. ఇలా అన్ని వయస్సుల వారు కలిపి మొత్తం 55 మంది ఈ పోటీలో పాల్గొంటున్నారు. ఈ పోటీలో పాల్గొనేవారు మొబైల్ ఫోన్ లేకుండా ఒకేచోట ఎక్కువసేపు కూర్చోవాలి. దీనికి కొన్ని నిబంధనలు కూడా ఉన్నాయి, వాటిని తప్పక పాటించాలి. ఈ పోటీలో విజేతకు ఓ సైకిల్, రూ.4,500 నగదు బహుమతి... రెండవ స్థానంలో నిలిచిన వారికి రూ.2,500, మూడవ స్థానంలో నిలిచిన వారికి రూ.1,500 నగదు బహుమతిగా అందజేస్తారు. ప్రజలను మొబైల్ ఫోన్లకు దూరంగా ఉండేలా ప్రోత్సహించడమే ఈ పోటీ యొక్క ప్రధాన ఉద్దేశం.

పోటీ నిబంధనలు:
*  మొబైల్ ఫోన్లను ఉపయోగించకూడదు.
*  పోటీ సమయంలో బయటకు వెళ్లి తినకూడదు, వాష్‌రూమ్‌కు వెళ్లకూడదు.
*  ఒకవేళ తినాలనుకుంటే కూర్చున్న చోటుకే ఆహారం, నీరు అందిస్తారు.
*  నిద్రపోకూడదు.
*  పోట్లాడుకోకూడదు, గట్టిగా మాట్లాడకూడదు.
*  పోటీ నుంచి ఎలిమినేట్ అయిన వారికి తిరిగి అవకాశం ఉండదు.
*  పుస్తకాలు చదవడం, యోగా వంటివి చేయవచ్చు.


More Telugu News