రుతురాజ్ విఫలమైనంత మాత్రాన వెంటనే జట్టు నుంచి తొలగించొద్దు: మాజీ క్రికెటర్ కీలక సూచన

  • రుతురాజ్‌కు ఓపెనర్‌గా అవకాశమిచ్చి చూడాలన్న ఆకాశ్ చోప్రా
  • ఓపెనర్‌గా అవకాశమిచ్చాక అతడి కెరీర్‌పై అంచనాకు రావాలని సూచన
  • నాలుగో స్థానంలో పంపించడాన్ని ప్రశ్నించిన చోప్రా
రుతురాజ్ గైక్వాడ్ వైఫల్యాలను అంచనా వేసే ముందు అతనికి ఓపెనర్‌గా అవకాశమిచ్చి చూడాలని మాజీ క్రికెటర్, వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా సూచించాడు. రాంచీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో రుతురాజ్ విఫలమయ్యాడు. నాలుగో స్థానంలో వచ్చిన అతను 14 బంతుల్లో 8 పరుగులకే అవుటయ్యాడు.

16 నెలల తర్వాత భారత జట్టులోకి పునరాగమనం చేసిన రుతురాజ్‌కు ఆకాశ్ చోప్రా మద్దతుగా నిలిచాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దింపడాన్ని తప్పుబట్టాడు. రుతురాజ్ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అని గుర్తు చేసిన ఆకాశ్ చోప్రా, నాలుగో స్థానంలో పంపించడంపై జట్టు యాజమాన్యాన్ని ప్రశ్నించాడు.

రుతురాజ్ ఇంతవరకు ఎప్పుడూ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయలేదని అన్నాడు. డెవాల్డ్ బ్రెవిస్ అద్భుతంగా క్యాచ్ పట్టడంతో క్రీజు వదలాల్సి వచ్చిందని, కానీ ఈ ప్రదర్శనను చూసి అతనిపై అప్పుడే ఒక అంచనాకు రావొద్దని సూచించాడు. నాలుగో స్థానంలో విఫలమైన అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలని ఆకాశ్ చోప్రా సూచించాడు. అతను ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అని గుర్తించి అవకాశం ఇవ్వాలని అన్నాడు.

అతనిని వెంటనే జట్టులో నుంచి తొలగించవద్దని సూచించాడు. ఓపెనర్‌గా అవకాశం ఇచ్చిన తర్వాత అతడి కెరీర్‌పై ఓ నిర్ణయం తీసుకోవాలని హితవు పలికాడు.

అదే సమయంలో రిషబ్ పంత్‌ను బెంచ్‌కు పరిమితం చేసి వాషింగ్టన్ సుందర్‌కు తుది జట్టులో అవకాశం ఇవ్వడంపై కూడా స్పందించాడు. రిషబ్ పంత్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అని, ఆ స్థానాల్లో అవకాశం ఉన్నప్పటికీ పంత్‌కు చోటు కల్పించలేదని అన్నాడు. ఆ స్థానంలో ఎప్పుడూ బ్యాటింగ్ చేయని వేరే ఇద్దరు ఆటగాళ్లను పంపించారని అన్నాడు.


More Telugu News