పార్లమెంట్ సమావేశాలు కుదించడంపై ప్రతిపక్షాల ఆగ్రహం

  • 20 రోజుల నుంచి 15 రోజులకు పార్లమెంటు సమావేశాల కుదింపు
  • సమావేశాలను సజావుగా జరిపే ఉద్దేశం కనిపించడం లేదన్న శివసేన ఎంపీ ప్రియాంక 
  • పార్లమెంటులో చర్చను అణచివేయాలని ప్రభుత్వం చూస్తోందన్న కాంగ్రెస్ నేత సురేంద్ర రాజ్ పుత్   
పార్లమెంట్ శీతాకాల సమావేశాలను కుదించడంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. సాధారణంగా ఈ సమావేశాలు 20 రోజులు జరుగుతాయి. అయితే, ఈసారి 15 రోజుల పాటు మాత్రమే జరగనున్నాయి. నేటి నుంచి ఈ నెల 19 వరకు సమావేశాలు జరగనుండగా, ఇందులో నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. శీతాకాల సమావేశాలను కుదించడంపై శివసేన (ఉద్దవ్ ఠాక్రే) ఎంపీ ప్రియాంక చతుర్వేది విమర్శలు చేశారు.

పార్లమెంట్ సమావేశాలను సజావుగా జరిపే ఉద్దేశం అధికార పక్షానికి ఉన్నట్లు కనిపించడం లేదని ప్రియాంక చతుర్వేది అన్నారు. అహంకారంతో ప్రతిచోట అధికారం నిలుపుకుంటామనే భావన వారిలో కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ విధానాలను అనుసరించాల్సిన అవసరం లేదని వారి అభిప్రాయంగా కనిపిస్తోందని అన్నారు.

కేవలం 15 రోజులలో 13 బిల్లులు తీసుకురావాలని చూస్తున్నారని, అంటే వీటిపై సరైన చర్చ జరగాలని వారు కోరుకోవడం లేదని అన్నారు. నిరసనల మధ్య ఈ బిల్లులను ఆమోదించాలని చూస్తున్నారని ఆరోపించారు.

కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి సురేంద్ర రాజ్‌పుత్ కూడా శీతాకాల సమావేశాలను కుదించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పక్షం పార్లమెంటులో చర్చను అణచివేయాలని చూస్తోందని విమర్శించారు. పార్లమెంటు సమావేశాలు ప్రజల కోసం నిర్వహిస్తారని, ప్రతిపక్షాలు ప్రజల తరఫున గళం విప్పడానికి అవకాశం ఉండాలని అన్నారు.

పార్లమెంటులో ప్రజా సమస్యలను ప్రస్తావించడానికి, ప్రశ్నించడానికి ప్రతిపక్షానికి లోక్ సభ స్పీకర్, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి, ఎన్డీయే ప్రభుత్వం అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలను నిలువరించడం ద్వారా సభను అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని కోరారు. ప్రజా ప్రయోజనాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం సభలో చర్చకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

శీతాకాల సమావేశాలను కుదించడం చూస్తుంటే ప్రభుత్వం తన బాధ్యతల నుంచి తప్పించుకున్నట్లుగా కనిపిస్తోందని కాంగ్రెస్ ఎంపీ శుఖ్‌దేవ్ భగత్ అన్నారు. జవాబుదారీతనం లేకుండా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.


More Telugu News