బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ దారుణ హత్య.. సూట్‌కేసులో కుక్కి అడవిలో పూడ్చిపెట్టిన మాజీ ప్రియుడు!

  • ఆస్ట్రియా బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టెఫానీ పైపర్ దారుణ హత్య
  • గొంతు నులిమి చంపి, సూట్‌కేసులో పెట్టి అడవిలో పాతిపెట్టిన మాజీ ప్రియుడు
  • కారుకు నిప్పంటుకున్న ఘటనతో స్లోవేనియాలో పట్టుబడ్డ నిందితుడు
ఆస్ట్రియాకు చెందిన ప్రముఖ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ స్టెఫానీ పైపర్ (31) దారుణ హత్యకు గురయ్యారు. ఆమెను హత్య చేసిన మాజీ ప్రియుడు, మృతదేహాన్ని ఒక సూట్‌కేసులో కుక్కి పొరుగు దేశమైన స్లోవేనియాలోని అడవిలో పాతిపెట్టాడు. వారం రోజులుగా అదృశ్యమైన ఆమె కేసును ఛేదించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.

మేకప్, ఫ్యాషన్ వీడియోలతో సోషల్ మీడియాలో గుర్తింపు పొందిన స్టెఫానీ, నవంబర్ 23న ఒక క్రిస్మస్ పార్టీకి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చారు. ఇంటికి సురక్షితంగా చేరుకున్నానని స్నేహితురాలికి మెసేజ్ పంపిన కాసేపటికే, తన మెట్ల వద్ద ఎవరో ఉన్నారని అనుమానంగా ఉందంటూ మరో మెసేజ్ పంపారు. ఆ తర్వాత ఆమె నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

అదే రోజు రాత్రి వారి అపార్ట్‌మెంట్‌లో గొడవ జరిగిన శబ్దాలు విన్నామని, స్టెఫానీ మాజీ ప్రియుడిని అక్కడ చూశామని పొరుగువారు పోలీసులకు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆస్ట్రియా-స్లోవేనియా సరిహద్దులోని ఒక క్యాసినో పార్కింగ్‌లో నిందితుడి కారు దగ్ధమవడంతో స్లోవేనియా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. స్టెఫానీని గొంతు నులిమి చంపి, మృతదేహాన్ని సూట్‌కేసులో పెట్టి స్లోవేనియా అడవిలో పూడ్చిపెట్టినట్లు తెలిపాడు. అతడు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ హత్యకు సహకరించారన్న ఆరోపణలతో నిందితుడి తండ్రి, సోదరుడిని కూడా అరెస్ట్ చేసినట్లు స్టైరియన్ రాష్ట్ర పోలీసులు వెల్లడించారు.


More Telugu News