భారతీయుల ప్రతిభ అమోఘం.. వారితో అమెరికాకు ఎంతో మేలు: ఎలాన్ మస్క్

  • ప్రతిభావంతులైన భారతీయులతో అమెరికాకు ఎంతో మేలు జరిగిందన్న మస్క్
  • కొన్ని కంపెనీలు హెచ్-1బీ వీసా వ్యవస్థను దుర్వినియోగం చేశాయని వ్యాఖ్య
  • అయితే హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను మూసేయడం సరికాదని స్పష్టీకరణ
  • ప్రపంచంలో అత్యుత్తమ ప్రతిభావంతులను నియమించుకోవడమే తమ లక్ష్యమని వెల్లడి
  • బైడెన్ ప్రభుత్వ వలస విధానాలపై తీవ్ర విమర్శలు
ప్రతిభావంతులైన భారతీయుల వల్ల అమెరికాకు ఎంతో మేలు జరిగిందని టెస్లా, స్పేస్‌ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ప్రశంసించారు. జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్ నిర్వహించిన ‘పీపుల్ బై డబ్ల్యూటీఎఫ్’ పాడ్‌కాస్ట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో, కొన్ని కంపెనీలు హెచ్-1బీ వీసా విధానాన్ని దుర్వినియోగం చేశాయని, అందుకే అమెరికాలో కొన్ని వలస వ్యతిరేక విధానాలు వచ్చాయని అభిప్రాయపడ్డారు.

హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్‌పై మస్క్ తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ‘‘కొన్ని ఔట్‌సోర్సింగ్ కంపెనీలు హెచ్-1బీ వీసా వ్యవస్థను తమకు అనుకూలంగా మార్చుకున్నాయి (గేమ్డ్ ది సిస్టమ్). ఈ దుర్వినియోగాన్ని అరికట్టాలి. కానీ, అంతమాత్రాన హెచ్-1బీ ప్రోగ్రామ్‌ను పూర్తిగా మూసివేయాలనే వాదన సరైంది కాదు. అలా చేస్తే దేశానికి తీవ్ర నష్టం జరుగుతుంది’’ అని ఆయన వివరించారు.

ప్రతిభావంతుల కొరత ఎప్పుడూ ఉంటుందని మస్క్ అన్నారు. ‘‘కొందరు అనుకున్నట్లు వలసదారుల వల్ల స్థానికులు ఉద్యోగాలు కోల్పోతున్నారనేది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. మా కంపెనీలలో క్లిష్టమైన పనులను పూర్తి చేయడానికి తగినంత మంది ప్రతిభావంతులు దొరకడమే కష్టంగా ఉంది. అందుకే, మరింత మంది ప్రతిభావంతులు వస్తే మంచిదే’’ అని తెలిపారు. తమ కంపెనీలలో ప్రపంచంలోని అత్యుత్తమ టాలెంట్ ఉన్నవారికే ప్రాధాన్యం ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.

ఇదే సమయంలో, బైడెన్ ప్రభుత్వ వలస విధానాలను మస్క్ తప్పుబట్టారు. "బైడెన్ హయాంలో సరిహద్దు నియంత్రణలు లేకపోవడంతో అక్రమ వలసలు భారీగా పెరిగాయి. సరిహద్దులు లేకపోతే అదొక దేశమే కాదు" అని ఆయన విమర్శించారు. ఈ వివరాలను ఎన్డీటీవీ తన కథనంలో పేర్కొంది. గతేడాది అమెరికా జారీ చేసిన హెచ్-1బీ వీసాలలో 71 శాతం భారతీయులే పొందడం గమనార్హం.


More Telugu News