బాలికపై పెంపుడు తండ్రి.. అతడి బావమరిది నెలల తరబడి అత్యాచారం

  • శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 14 ఏళ్ల బాలికపై అత్యాచారం
  • అస్వస్థతకు గురవడంతో గర్భవతి అని వైద్య పరీక్షల్లో నిర్ధారణ
  • ఇద్దరు నిందితులపై పోక్సో కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో అత్యంత దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన పెంపుడు తండ్రి, అతడి బావమరిది కలిసి 14 ఏళ్ల బాలికపై నెలల తరబడి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక గర్భం దాల్చడంతో ఈ అమానవీయ సంఘటన బయటపడింది.

ధర్మవరానికి చెందిన దంపతులు 14 ఏళ్ల క్రితం చిత్తూరు జిల్లా బోయకొండ గంగమ్మ ఆలయం వద్ద ఓ ఆడ శిశువును దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి ఆ బాలికను సొంత కూతురిలా పెంచుకుంటున్నారు. అయితే, ఇటీవల పెంపుడు తండ్రి, అతని బావమరిది బాలికపై కన్నేశారు. బెదిరింపులకు గురిచేస్తూ కొన్ని నెలలుగా లైంగిక దాడికి పాల్పడుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించడంతో బాలిక మౌనంగా ఉండిపోయింది.

ఆదివారం బాలిక అస్వస్థతకు గురికావడంతో, పెంపుడు తల్లి ఆమెను స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లింది. వైద్యులు పరీక్షలు నిర్వహించి, బాలిక ఐదు నెలల గర్భవతి అని నిర్ధారించారు. దీంతో ఆ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. తన సోదరుడే ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని అనుమానించి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విషయం తెలుసుకున్న డీఎస్పీ హేమంత్‌కుమార్‌, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. పెంపుడు తండ్రితో పాటు అతని బావమరిది కూడా తనపై అత్యాచారం చేశారని బాలిక వాపోయింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు ఇద్దరు నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని డీఎస్పీ తెలిపారు.


More Telugu News