నాందేడ్ లో పరువు హత్య... ప్రియుడి మృతదేహాన్ని పెళ్లాడిన యువతి

  • మహారాష్ట్ర నాందేడ్‌లో 20 ఏళ్ల యువకుడి దారుణ హత్య
  • కులాంతర ప్రేమను వ్యతిరేకించిన యువతి కుటుంబ సభ్యుల ఘాతుకం
  • ప్రియుడి మృతదేహానికి పసుపు రాసి, నుదుట సిందూరం దిద్దుకున్న ప్రియురాలు
  • నిందితులైన ఆరుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
మహారాష్ట్రలోని నాందేడ్‌లో జరిగిన ఒక పరువు హత్య తీవ్ర కలకలం రేపింది. తమ కూతురిని ప్రేమిస్తున్నాడన్న కారణంతో ఓ యువకుడిని ఆమె కుటుంబ సభ్యులే అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ప్రియుడి అంత్యక్రియల వద్దకు చేరుకున్న ఆ యువతి, అతని మృతదేహాన్ని పెళ్లాడి, ఇకపై అతని కుటుంబంతోనే కోడలిగా ఉంటానని శపథం చేయడం అందరినీ కదిలించింది.

వివరాల్లోకి వెళితే.. నాందేడ్‌కు చెందిన సాక్షం టేటే (20), ఆంచల్ అనే యువతి గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తన సోదరుల ద్వారా పరిచయమైన సాక్షంతో ఆంచల్‌కు సాన్నిహిత్యం పెరిగింది. అయితే వేర్వేరు కులాలు కావడంతో ఆంచల్ కుటుంబ సభ్యులు వారి పెళ్లిని తీవ్రంగా వ్యతిరేకించారు. సంబంధం మానుకోవాలని అనేకసార్లు బెదిరించారు. అయినప్పటికీ వారు తమ ప్రేమను వదులుకోలేదు.

సాక్షంను పెళ్లి చేసుకోవాలని ఆంచల్ నిర్ణయించుకున్న విషయం తెలియడంతో ఆమె తండ్రి, సోదరులు గురువారం అతనిపై దాడి చేశారు. సాక్షంను తీవ్రంగా కొట్టి, తలపై తుపాకీతో కాల్చి, అనంతరం బండరాయితో తల నుజ్జునుజ్జు చేసి కిరాతకంగా హత్య చేశారు.

సాక్షం అంత్యక్రియలు జరుగుతుండగా ఆంచల్ అక్కడికి చేరుకుంది. అతని మృతదేహానికి పసుపు రాసి, తన నుదుట సిందూరం దిద్దుకుంది. చనిపోయినా తన ప్రియుడినే భర్తగా స్వీకరించింది. జీవితాంతం సాక్షం ఇంట్లోనే అతని భార్యగా, వారి కోడలిగా ఉండిపోతానని నిర్ణయించుకుంది. "సాక్షం మరణంలో కూడా మా ప్రేమే గెలిచింది. మా నాన్న, సోదరులు ఓడిపోయారు. సాక్షం చనిపోయినా మా ప్రేమ బతికే ఉంది" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేసింది.

ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, హత్యకు పాల్పడిన ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News