దారితప్పి మూసవానిపేట తీరానికి చేరుకున్న బంగ్లాదేశ్ మత్స్యకారులు

  • శ్రీకాకుళం తీరానికి కొట్టుకొచ్చిన బంగ్లాదేశ్ బోటు
  • ఆహారం, ఇంధనం అయిపోవడంతో దారితప్పిన 13 మంది జాలర్లు
  • స్థానికులు, మెరైన్ పోలీసుల సాయంతో సురక్షితంగా ఒడ్డుకు
  • చట్టప్రకారం కేసు నమోదు చేస్తామన్న పోలీసులు
సముద్రంలో చేపల వేటకు వెళ్లి దారితప్పిన 13 మంది బంగ్లాదేశ్ మత్స్యకారులు శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం మూసవానిపేట తీరానికి కొట్టుకొచ్చారు. రోజుల తరబడి ఆహారం, ఇంధనం లేక నీరసించిపోయిన వారిని స్థానిక మత్స్యకారులు, పోలీసులు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

వివరాల్లోకి వెళితే.. బంగ్లాదేశ్‌కు చెందిన 13 మంది మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లారు. తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల వారు దారితప్పారు. సుమారు 15 రోజులకు సరిపడా తెచ్చుకున్న ఇంధనం, ఆహార సామగ్రి అయిపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాల మీదుగా ప్రయాణిస్తూ చివరికి శ్రీకాకుళం జిల్లా తీరానికి చేరుకున్నారు.

మూసవానిపేట తీరంలో అనుమానాస్పదంగా ఉన్న బోటును గమనించిన స్థానిక మత్స్యకారులు వెంటనే మెరైన్, స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. మెరైన్ సీఐ బి. ప్రసాదరావు, ఎస్సై జి. లక్ష్మణరావు తమ సిబ్బందితో కలిసి మూడు బోట్ల సాయంతో వారిని ఒడ్డుకు తీసుకొచ్చారు. "వారం రోజులుగా భోజనం లేదు. ఎటు వెళ్తున్నామో తెలియక చాలా భయపడ్డాం" అని బాధితులు తమ ఆవేదన వ్యక్తం చేశారు.

ఒడ్డుకు చేరిన వెంటనే స్థానికులు వారికి చలిమంట వేసి, ఆహారం, నీళ్లు అందించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం వారిని కళింగపట్నం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా దేశ సరిహద్దులు దాటినందుకు చట్టప్రకారం కేసు నమోదు చేస్తామని మెరైన్ సీఐ తెలిపారు. కాగా, ఇదే తరహా ఘటన 2008లో బుడగట్లపాలెం తీరంలో జరిగిందని స్థానికులు గుర్తుచేసుకుంటున్నారు.


More Telugu News