హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ ఫీవర్.. మైదానంలోకి సీఎం రేవంత్, లియోనెల్ మెస్సీ

  • ప్రపంచ ఫుట్‌బాల్ స్టార్ మెస్సీతో సీఎం రేవంత్ రెడ్డి ఫుట్‌బాల్ మ్యాచ్
  • డిసెంబర్ 13న ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో డ్రీమ్ మ్యాచ్
  • తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ముగింపు సందర్భంగా ప్రత్యేక ఈవెంట్
  • ఆర్ఆర్-9 టీమ్‌కు రేవంత్, ఎల్ఎం-10 టీమ్‌కు కెప్టెన్‌గా మెస్సీ 
  • ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతోనూ ఫుట్‌బాల్ ఆడనున్న లియోనెల్ మెస్సీ
ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్య ఓ అరుదైన ఫుట్‌బాల్ మ్యాచ్ జరగనుంది. డిసెంబర్ 13న హైదరాబాద్‌లోని ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియం ఈ ఆసక్తికర పోరుకు వేదిక కానుంది. ఈ వార్త క్రీడా, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్సుకతను రేకెత్తిస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’ ముగింపు వేడుకల్లో భాగంగా ఈ డ్రీమ్ మ్యాచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ మ్యాచ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ‘ఆర్ఆర్-9’ జట్టు తరఫున 9వ నంబర్ జెర్సీతో బరిలోకి దిగనుండగా, లియోనెల్ మెస్సీ తన ట్రేడ్‌మార్క్ 10వ నంబర్ జెర్సీతో ‘ఎల్ఎం-10’ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు.

ఈ మ్యాచ్‌కు ముందు మెస్సీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులతో కలిసి ఫుట్‌బాల్ ఆడనున్నాడు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అంతర్జాతీయ క్రీడాకారుడు మైదానంలో నేరుగా తలపడనుండటం ఇదే మొదటిసారి కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత ఆసక్తి నెలకొంది. ఈ ప్రత్యేక కార్యక్రమం తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.


More Telugu News