నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదు: పోలీసులకు సీపీ సజ్జనార్ హెచ్చరిక

  • ఫిర్యాదులపై వెంటనే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలన్న సజ్జనార్
  • డ్రగ్స్, ఆన్‌లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
  • మహిళలు, బాధితుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలని సిబ్బందికి దిశానిర్దేశం
విధి నిర్వహణలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించినా కఠిన చర్యలు తప్పవని, సస్పెన్షన్ వేటు వేయడానికి కూడా వెనుకాడబోమని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సిబ్బందిని గట్టిగా హెచ్చరించారు. పోలీసులు నిరంతరం అప్రమత్తంగా ఉంటేనే సమాజంలో అసాంఘిక శక్తులు అదుపులో ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. కమిషనరేట్‌లో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో ఆయన అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ.. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులను పక్కన పెట్టడం లేదా నేర తీవ్రతను తగ్గించి చూపడం వంటివి చేస్తే ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. నగరంలో జరిగే కీలకమైన కేసుల దర్యాప్తును పర్యవేక్షించేందుకు ప్రత్యేకంగా ఒక 'సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్' ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.

చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల ఫైళ్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా డ్రగ్స్, ఆన్‌లైన్ గేమింగ్‌పై ఉక్కుపాదం మోపాలని సూచించారు. సైబర్ క్రైమ్, మహిళల భద్రత, వీధి నేరాలు, ఆహార కల్తీ వంటి కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. పోలీస్ స్టేషన్‌కు వచ్చే మహిళల పట్ల మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలని సిబ్బందికి సూచించారు. ఈ సమావేశంలో పలువురు అడిషనల్ సీపీలు, డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు పాల్గొన్నారు.


More Telugu News