నా బరువు తగ్గడం వెనుక రహస్యం అదే.. 120 కిలోలు ఎలా తగ్గానో చెప్పిన అద్నాన్ సమీ

  • సర్జరీతో కాదు.. కఠినమైన డైట్‌తోనే 120 కిలోలు తగ్గానన్న అద్నాన్ సమీ
  • 230 కిలోల నుంచి 110 కిలోలకు తగ్గినట్లు వెల్లడి
  • అన్నం, బ్రెడ్, చక్కెర, నూనె, మద్యం పూర్తిగా మానేశానని స్పష్టీక‌ర‌ణ‌
  • ఒక టీ-షర్ట్ తనలో పట్టుదల పెంచిందని చెప్పిన ప్రముఖ గాయకుడు
  • బరువు తగ్గడానికి ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండవన్న‌ సమీ
ప్రముఖ గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత అద్నాన్ సమీ తన బరువు తగ్గిన ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తాను 230 కిలోల నుంచి 120 కిలోల బరువు తగ్గడానికి ఎలాంటి సర్జరీ చేయించుకోలేదని, కేవలం కఠినమైన ఆహార నియమాలు, వ్యాయామంతోనే ఇది సాధ్యమైందని స్పష్టం చేశారు. ఇటీవల ‘ఆప్ కీ అదాలత్’ కార్యక్రమంలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

"చాలామంది నేను బేరియాట్రిక్ సర్జరీ లేదా లిపోసక్షన్ చేయించుకున్నానని ఊహాగానాలు చేశారు. నిజానికి 230 కిలోల బరువున్న నా ఒంట్లోని కొవ్వును తీయాలంటే వాక్యూమ్ క్లీనర్ అవసరం పడుతుంది" అని ఆయన చమత్కరించారు. తన న్యూట్రిషనిస్ట్ సూచన మేరకు "బ్రెడ్, అన్నం, చక్కెర, నూనె, మద్యం" వంటి వాటికి పూర్తిగా దూరంగా ఉన్నానని తెలిపారు. ఈ డైట్ పాటించడం మొదలుపెట్టిన మొదటి నెలలోనే తాను 20 కిలోలు తగ్గినట్లు వివరించారు.

స్ఫూర్తినిచ్చిన ఆ టీ-షర్ట్ కథ
తనకు స్ఫూర్తినిచ్చిన ఒక సంఘటనను గుర్తుచేసుకుంటూ, "ఒకప్పుడు నేను 9XL సైజు దుస్తులు వేసుకునేవాడిని. ఓ షాపింగ్ మాల్‌లో XL సైజు టీ-షర్ట్ చూసి ఇష్టపడ్డాను. కొంచెం బరువు తగ్గినట్లు అనిపించిన ప్రతీసారి, అర్ధరాత్రి కూడా ఆ టీ-షర్ట్ వేసుకుని సరిపోతుందో లేదో చూసుకునేవాడిని. ఒకరోజు తెల్లవారుజామున 3 గంటలకు అది నాకు సరిగ్గా సరిపోయింది. ఆనందంతో మా నాన్నకు ఫోన్ చేసి చెప్పాను" అని తెలిపారు.

బరువు తగ్గడానికి జీవితంలో ఎలాంటి షార్ట్‌కట్స్ ఉండవని, కష్టపడితేనే ఏదైనా సాధించగలమని అద్నాన్ సమీ తన అనుభవంతో స్పష్టం చేశారు.


More Telugu News