మాటల యుద్ధానికి బ్రేక్.. కాసేపట్లో సిద్దూ-డీకే బ్రేక్‌ఫాస్ట్ మీట్

  • కర్ణాటక కాంగ్రెస్‌లో ముదిరిన నాయకత్వ సంక్షోభం
  • అధిష్ఠానం జోక్యంతో చర్చలకు అంగీకరించిన నేతలు
  • సీఎం పదవిపై ఒప్పందం ఉందని శివకుమార్ వర్గం వాదన
  • అవిశ్వాస తీర్మానం పెడతామంటూ బీజేపీ హెచ్చరిక
కర్ణాటక కాంగ్రెస్‌లో రాజుకున్న ముఖ్యమంత్రి పదవి వివాదాన్ని పరిష్కరించేందుకు అధిష్ఠానం ఆదేశాలతో కీలక నేతలు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరికాసేపట్లో బ్రేక్‌ఫాస్ట్ సమావేశంలో భేటీ కానున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో, గతంలో కుదిరిన ఒప్పందం ప్రకారం శివకుమార్‌కు సీఎం పదవిని అప్పగించాలని ఆయన వర్గం నుంచి డిమాండ్లు పెరుగుతుండటంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది.

కాంగ్రెస్ అధిష్ఠానం జోక్యం చేసుకుని విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇద్దరు నేతలకు స్పష్టం చేసింది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఇరువురితో మాట్లాడి, బహిరంగ విమర్శలు, సోషల్ మీడియాలో పోస్టులు పార్టీ సంస్కృతికి విరుద్ధమని హెచ్చరించారు. ఢిల్లీకి వెళ్లే ముందు స్థానికంగా సమస్యను పరిష్కరించుకోవాలని చెప్పినట్లు సమాచారం.

ఈ సమావేశంపై సిద్దరామయ్య మాట్లాడుతూ.. హైకమాండ్ ఆదేశాల మేరకే శివకుమార్‌ను బ్రేక్‌ఫాస్ట్‌కు ఆహ్వానించినట్టు తెలిపారు. అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. మరోవైపు, తనకు సీఎం పదవిపై తొందర లేదని, పార్టీ నిర్ణయమే శిరోధార్యమని శివకుమార్ అన్నారు.

ఈ అంతర్గత సంక్షోభంపై ప్రతిపక్ష బీజేపీ దృష్టి సారించింది. కాంగ్రెస్‌లో గొడవలు ఇలాగే కొనసాగితే, రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో అవిశ్వాస తీర్మానం పెట్టే అవకాశం ఉందని మాజీ సీఎం, బీజేపీ ఎంపీ బసవరాజ్ బొమ్మై హెచ్చరించారు. అయితే ఈ ఆరోపణలను సిద్దరామయ్య కుమారుడు, ఎమ్మెల్యే యతీంద్ర ఖండిస్తూ.. ఇదంతా మీడియా సృష్టేనని అన్నారు. 


More Telugu News