ఆధార్ కేంద్రాలకు వెళ్లక్కర్లేదు.. ఇక ఇంటి నుంచే మొబైల్ నంబర్ అప్‌డేట్

  • ఆధార్‌లో మొబైల్ నంబర్ మార్పునకు కొత్త సౌకర్యం
  • ఓటీపీ, ఫేస్ అథెంటికేషన్‌తో ఇంటి నుంచే అప్‌డేట్
  • త్వరలో ఈ సదుపాయం తీసుకురానున్నట్లు యూఐడీఏఐ ప్రకటన
  • ఎం-ఆధార్ యాప్ ద్వారా అందుబాటులోకి రానున్న కొత్త ఫీచర్
ఆధార్ కార్డ్ వినియోగదారులకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) ఒక ముఖ్యమైన శుభవార్త చెప్పింది. ఇకపై ఆధార్‌తో అనుసంధానమైన మొబైల్ నంబర్‌ను మార్చుకోవడానికి ఆధార్ సేవా కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, ఇంట్లో నుంచే అప్‌డేట్ చేసుకునే సౌలభ్యాన్ని త్వరలో తీసుకురానున్నట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ కొత్త విధానం అమల్లోకి వస్తే ప్రజలకు ఎంతో సమయం ఆదా అవుతుంది.

ఈ కొత్త ఫీచర్‌పై యూఐడీఏఐ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' వేదికగా వివరాలు వెల్లడించింది. వినియోగదారులు ఓటీపీ (OTP) వెరిఫికేషన్, ఫేస్ అథెంటికేషన్ ద్వారా సులభంగా తమ మొబైల్ నంబర్‌ను మార్చుకోవచ్చని తెలిపింది. ఈ సేవ 'ఎం-ఆధార్' (mAadhaar) యాప్‌లో అందుబాటులో ఉంటుందని, ఈ యాప్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని సూచించింది.

ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కేవలం చిరునామా మార్పునకు మాత్రమే అవకాశం ఉంది. మొబైల్ నంబర్ లేదా ఇతర వివరాలు మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఆధార్ కేంద్రానికి వెళ్లి బయోమెట్రిక్ ఇవ్వాల్సి వస్తోంది. ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి వస్తే, క్యూలలో నిలబడే శ్రమ తప్పుతుంది. ఈ సదుపాయాన్ని ముందుగా పరీక్షించాలనుకునే వారు తమ ఫీడ్‌బ్యాక్‌ను ఈ-మెయిల్ ద్వారా పంపవచ్చని యూఐడీఏఐ కోరింది.

దీంతో పాటు భవిష్యత్తులో మరిన్ని కీలక వివరాలను ఫోన్ నుంచే అప్‌డేట్ చేసుకునేలా ఒక సురక్షితమైన మొబైల్ యాప్‌ను అభివృద్ధి చేసే పనిలో యూఐడీఏఐ నిమగ్నమైంది. చాలా స్మార్ట్‌ఫోన్‌లలో ఉండే ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ ఆధారంగా ఈ యాప్ పనిచేస్తుందని, బయోమెట్రిక్ స్కానింగ్‌పై ఆధారపడటాన్ని తగ్గిస్తుందని అధికారులు తెలిపారు.


More Telugu News