కడప టీచర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు.. బోధనా శైలికి మెచ్చుకోలు !

  • కడప జిల్లా టీచర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు
  • తాళ్ళ ప్రొద్దుటూరు స్కూల్ టీచర్ హయత్ భాషాకు అభినందన
  • బోధనా శైలి స్ఫూర్తిదాయకమన్న మంత్రి 
  • మ్యాథ్స్ పజిల్స్, ట్రిక్స్‌తో సులభంగా బోధన చేస్తున్నారని కొనియాడిన లోకేశ్
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడిపై ప్రశంసలు కురిపించారు. వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన సెకండరీ గ్రేడ్ టీచర్ హయత్ భాషా బోధనా శైలిని మెచ్చుకుంటూ ఆయన ట్వీట్ చేశారు. విద్యార్థుల్లో నైతిక విలువలు, భాషాభిమానం పెంపొందించేందుకు ఆయన చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకమని కొనియాడారు.

వివరాల్లోకి వెళితే.. కొండాపురం మండలం, తాళ్ళ ప్రొద్దుటూరు మోడల్ ప్రైమరీ స్కూల్‌లో హయత్ భాషా ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఆయన తెలుగు భాషపై చూపిస్తున్న అభిమానం ముచ్చటేస్తోందని లోకేశ్ పేర్కొన్నారు. విద్యార్థులు చూడకుండా పద్యాలు, పదాలు, గేయాలు అప్పజెప్పేలా వారిని తయారుచేస్తున్న తీరు అద్భుతమన్నారు. వేమన పద్యాలు, సుమతి శతకాల ద్వారా పిల్లల్లో నైతిక విలువలు పెంపొందించేందుకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని అభినందించారు.

రెగ్యులర్ సబ్జెక్టులతో పాటు, విద్యార్థులతో మ్యాథ్స్ పజిల్స్ చేయిస్తూ, "Maths made easy with Tricks" విధానంలో సులభంగా గణితం నేర్పిస్తున్న హయత్ భాషా మాస్టారి బోధనా తీరు ఎంతో స్ఫూర్తినిస్తోందని లోకేశ్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా హయత్ భాషాకు ఆయన ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. 


More Telugu News