G Kishan Reddy: యాదాద్రి భక్తులకు శుభవార్త.. ఎంఎంటీఎస్ రైలుకు గ్రీన్ సిగ్నల్

MMTS Train to Yadadri Gets Green Signal Says G Kishan Reddy
  • హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైలు
  • నిధులు మంజూరయ్యాయని వెల్లడించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • రూ.720 కోట్లతో సికింద్రాబాద్ స్టేషన్ అభివృద్ధి పనులు
  • తెలంగాణలో ఒకేసారి 40 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ
  • సంక్రాంతికి హైటెక్ సిటీ స్టేషన్‌లో 16 రైళ్లకు ప్రత్యేక హాల్టింగ్
యాదాద్రి భక్తులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హైదరాబాద్ నుంచి యాదగిరిగుట్ట వరకు ఎంఎంటీఎస్ రైళ్లను నడిపేందుకు చర్యలు చేపడుతున్నామని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధులు ఇప్పటికే మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టం చేశారు.

హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో కలిసి కిషన్ రెడ్డి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.26 కోట్ల వ్యయంతో చేపట్టిన హైటెక్ సిటీ స్టేషన్ తొలి దశ పనులు వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి పూర్తవుతాయని చెప్పారు. అనంతరం రూ.10 కోట్లతో రెండో దశ పనులు మొదలుపెడతామన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని, ఒకేసారి 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నట్లు కిషన్‌రెడ్డి వివరించారు. ముఖ్యంగా సికింద్రాబాద్ స్టేషన్ ఆధునికీకరణకు రూ.720 కోట్లు, నాంపల్లి స్టేషన్ అభివృద్ధికి రూ.350 కోట్లు కేటాయించినట్లు పేర్కొన్నారు.

ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పండుగ సందర్భంగా హైటెక్ సిటీ స్టేషన్‌లో 16 ప్రత్యేక రైళ్లకు హాల్టింగ్ కల్పిస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం, షిర్డీ, ముంబై, మచిలీపట్నం, కాకినాడ, నర్సాపురం వెళ్లే రైళ్లు ఆగుతాయని ఆయన వెల్లడించారు.
G Kishan Reddy
Yadadri
MMTS train
Hyderabad
Yadagirigutta
Railway station development
Telangana railways
Konda Vishweshwar Reddy
Sankranti special trains
Secunderabad station

More Telugu News