Rajanna Sircilla: సిరిసిల్లలో తీవ్ర విషాదం.. తల్లి మరణాన్ని తట్టుకోలేక కానిస్టేబుల్ ఆత్మహత్య

Constable Abhilash Commits Suicide After Mothers Death in Siricilla
  • తల్లి ఆత్మహత్యను జీర్ణించుకోలేక వాగులో దూకిన కానిస్టేబుల్
  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన
  • తల్లి మృతదేహాన్ని చూసిన కొద్దిసేపటికే కొడుకు ప్రాణాలు వదిలిన వైనం
  • అందరూ చూస్తుండగానే మానేరువాగులో దూకిన కానిస్టేబుల్ అభిలాశ్‌
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కన్నతల్లి మరణాన్ని తట్టుకోలేని ఓ కానిస్టేబుల్, ఆమె మృతదేహాన్ని చూసిన కొద్దిసేపటికే వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ హృదయ విదారక ఘటన తంగళ్లపల్లి మండల కేంద్రంలో జరిగింది.

స్థానిక మంచికట్ల లలితకు, ఆమె కుమారుడు అభిలాశ్‌ (33)కు మధ్య మంచి అనుబంధం ఉండేది. భర్త ఆరేళ్ల క్రితం మరణించడంతో లలిత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో గురువారం ఇంటి నుంచి వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. శుక్రవారం ఉదయం కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంతలో సిరిసిల్ల సమీపంలోని మానేరువాగులో ఓ మహిళ మృతదేహం లభించింది.

పోలీసులతో పాటు అక్కడికి వెళ్లిన అభిలాశ్‌, అది తన తల్లి లలిత మృతదేహమేనని గుర్తించి కన్నీరుమున్నీరుగా విలపించాడు. తల్లి నిర్జీవంగా పడి ఉండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. అక్కడున్న పోలీసులు, స్థానికులు చూస్తుండగానే ఒక్కసారిగా అదే వాగులోకి దూకేశాడు. అక్కడున్న వారికి ఎవరికీ ఈత రాకపోవడంతో అతడిని కాపాడే ప్రయత్నం ఫలించలేదు.

అభిలాశ్‌ 2012లో కానిస్టేబుల్‌గా ఉద్యోగం సాధించి, ప్రస్తుతం 17వ పోలీస్ బెటాలియన్‌లో పనిచేస్తున్నాడు. అతనికి వివాహం చేసేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లి, కొడుకుల మృతదేహాలను సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Rajanna Sircilla
Abhilash
Constable Abhilash
Telangana Police
Suicide
Mother's Death
Police Battalion
Maneru Vagu
Tangallapalli
Family Tragedy

More Telugu News