అది కదా అసలైన స్నేహం.. జెమీమా రోడ్రిగ్స్‌ను మెచ్చుకున్న సునీల్ శెట్టి

  • స్నేహితురాలు స్మృతి మంధాన కోసం డ‌బ్ల్యూబీఎల్‌ నుంచి వైదొలిగిన జెమీమా
  • తండ్రి అనారోగ్యంతో స్మృతి వివాహం వాయిదా పడటమే కారణం
  • జెమీమా నిర్ణయాన్ని ప్రశంసించిన బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి
  • నిజమైన స్నేహానికి నిదర్శనమంటూ సోషల్ మీడియాలో పోస్ట్
టీమిండియా మహిళా క్రికెటర్ జెమీమా రోడ్రిగ్స్ తీసుకున్న ఓ నిర్ణయంపై బాలీవుడ్ సీనియర్ నటుడు సునీల్ శెట్టి ప్రశంసలు కురిపించారు. తన స్నేహితురాలు, సహచర క్రీడాకారిణి స్మృతి మంధానకు కష్టకాలంలో అండగా నిలిచేందుకు, జెమీమా ప్రతిష్ఠాత్మక విమెన్స్ బిగ్ బాష్ లీగ్ (WBBL) నుంచి వైదొలగడం అందరి హృదయాలను గెలుచుకుంది.

వివరాల్లోకి వెళితే... స్మృతి మంధాన తండ్రి గతవారం గుండె సంబంధిత అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆమె వివాహం వాయిదా పడింది. ఈ క్లిష్ట సమయంలో స్నేహితురాలికి తోడుగా ఉండేందుకు జెమీమా భారత్‌లోనే ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు. వాస్తవానికి, స్మృతి పెళ్లి కోసం భారత్‌కు వచ్చిన జెమీమా, తిరిగి ఆస్ట్రేలియా వెళ్లి బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ తరఫున డ‌బ్ల్యూబీఎల్‌ ఆడాల్సి ఉంది.

ఈ విషయంపై సునీల్ శెట్టి ‘ఎక్స్’ (గతంలో ట్విట్టర్) వేదికగా స్పందించారు. "ఉదయాన్నే ఈ వార్త చూడగానే నా మనసు నిండిపోయింది. స్మృతి కోసం జెమీమా డ‌బ్ల్యూబీఎల్‌ను వదిలేసింది. ఎలాంటి పెద్ద ప్రకటనలు లేకుండా నిశ్శబ్దంగా సంఘీభావం తెలిపింది. నిజమైన సహచరులు ఇలాగే ఉంటారు. చాలా నిజాయతీతో కూడిన స్నేహం ఇది" అని ఓ పత్రిక కథనాన్ని షేర్ చేస్తూ పోస్ట్ చేశారు.

జెమీమా అభ్యర్థన మేరకు, టోర్నీలోని మిగిలిన నాలుగు మ్యాచ్‌ల నుంచి ఆమెను విడుదల చేస్తున్నట్లు బ్రిస్బేన్ హీట్ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జరిగిన ఇంటర్నేషనల్ ప్లేయర్ డ్రాఫ్ట్‌లో బ్రిస్బేన్ హీట్ జెమీమాను నెం.1 పిక్‌గా ఎంచుకున్న సంగతి తెలిసిందే. అలాంటి కీలకమైన క్రీడాకారిణి స్నేహం కోసం టోర్నీని త్యాగం చేయడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.




More Telugu News