బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమం

  • ఢాకా ఆసుపత్రిలో సీసీయూలో చికిత్స
  • గుండె, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఖలీదా
  • ఆమె కోసం ప్రార్థించాలని దేశ ప్రజలను కోరిన బీఎన్‌పీ పార్టీ
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్‌పీ) ఛైర్‌పర్సన్ ఖలీదా జియా ఆరోగ్యం అత్యంత విషమంగా మారింది. ఆమె త్వరగా కోలుకోవాలని దేశ ప్రజలు ప్రార్థించాలని ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం ఆమె ఢాకాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

శుక్రవారం ఢాకాలో విలేకరుల సమావేశంలో బీఎన్‌పీ సెక్రటరీ జనరల్ మీర్జా ఫక్రుల్ ఇస్లాం అలంగీర్ ఈ వివరాలు వెల్లడించారు. "మన నాయకురాలు బేగం ఖలీదా జియా అస్వస్థతకు గురై ఆసుపత్రిలో చేరారు. గురువారం రాత్రి ఆమె ఆరోగ్య పరిస్థితి చాలా క్లిష్టంగా ఉందని వైద్యులు తెలిపారు" అని ఆయన అన్నారు. గుండె, ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్‌తో పాటు న్యుమోనియాతో కూడా ఆమె బాధపడుతున్నట్లు తెలిసింది. నవంబర్ 23 రాత్రి వైద్యుల సూచన మేరకు ఆమెను ఆసుపత్రిలో చేర్చగా, ప్రస్తుతం కరోనరీ కేర్ యూనిట్ (సీసీయూ)లో నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు.

ఇటీవల ఆగస్టు 5న విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయిన తర్వాత, అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ఖలీదా జియాను అధ్యక్షుడు మహ్మద్ షహబుద్దీన్ కార్యనిర్వాహక ఉత్తర్వులతో విడుదల చేశారు. ఆ తర్వాత కోర్టు కూడా ఆమె శిక్షలను రద్దు చేసింది. అంతకుముందు, లండన్‌లో నాలుగు నెలల పాటు వైద్య చికిత్స తీసుకుని ఆమె ఈ ఏడాది మే నెలలోనే ఢాకాకు తిరిగి వచ్చారు.

ఇదిలా ఉండగా, లండన్ నుంచి పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న ఆమె కుమారుడు తారిఖ్ రెహమాన్ కూడా బంగ్లాదేశ్‌కు తిరిగి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. పలు కీలక కేసుల నుంచి ఆయనకు విముక్తి లభించడంతో, డిసెంబర్ మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన వెంటనే ఆయన స్వదేశానికి వస్తారని అంచనా వేస్తున్నారు.


More Telugu News