మహమ్మద్ కుట్టీ... మమ్ముట్టిగా మారడం వెనుక ఆసక్తికర కథ!

  • తన పేరు వెనుక ఉన్న రహస్యాన్ని బయటపెట్టిన మమ్ముట్టి
  • కాలేజీలో స్నేహితుడి పొరపాటు వల్లే ఈ పేరు స్థిరపడిందని వెల్లడి
  • తనకు ఆ పేరు పెట్టిన శశిధరన్‌ను వేదికపై పరిచయం చేసిన మమ్ముట్టి
మలయాళ చిత్ర పరిశ్రమలో 'మెగాస్టార్‌'గా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న నటుడు మమ్ముట్టి... తన పేరు వెనుక ఉన్న ఆసక్తికర కథను తాజాగా పంచుకున్నారు. ఆయన అసలు పేరు మహమ్మద్ కుట్టీ కాగా, అది 'మమ్ముట్టి'గా ఎలా మారిందో ఒక కార్యక్రమంలో వివరించారు. అంతేకాదు, తనకు ఆ పేరు రావడానికి కారణమైన తన చిన్ననాటి స్నేహితుడిని కూడా అభిమానులకు పరిచయం చేశారు.

కేరళలో జరిగిన ఓ కార్యక్రమంలో మమ్ముట్టి తన కాలేజీ రోజుల నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. "నేను కాలేజీలో చదివేటప్పుడు అందరితోనూ నా పేరు ఒమర్ షరీఫ్ అని చెప్పేవాడిని. నా అసలు పేరు మహమ్మద్ కుట్టీ అని ఎవరికీ తెలియదు. ఒకరోజు అనుకోకుండా నా ఐడీ కార్డు మర్చిపోయాను. దీంతో నా అసలు పేరు కాలేజీ మొత్తానికి తెలిసిపోయింది" అని తెలిపారు.

అదే సమయంలో తన స్నేహితుల్లో ఒకరైన శశిధరన్, ఐడీ కార్డులోని 'మహమ్మద్ కుట్టీ' అనే పేరును పొరపాటున 'మమ్ముట్టి' అని చదివారని చెప్పారు. "అతను తప్పుగా చదివిన ఆ పేరే తర్వాత నాకు స్థిరపడిపోయింది" అని నవ్వుతూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన స్నేహితుడు శశిధరన్‌ను వేదికపైకి పిలిచి ప్రేక్షకులకు పరిచయం చేశారు. 


More Telugu News