స్మృతి మంధాన పెళ్లిపై వీడని సస్పెన్స్.. త్వరలోనే అంటున్న కాబోయే అత్త!

  • తండ్రి అనారోగ్యంతో వాయిదా పడ్డ స్మృతి మంధాన వివాహం
  • ఆ వెంటనే అనారోగ్యం పాలైన కాబోయే భర్త పలాశ్ ముచ్చల్
  • సోషల్ మీడియాలో వైరల్ అయిన చాట్ స్క్రీన్‌షాట్లతో పెరిగిన అనుమానాలు
  • పెళ్లి ఫొటోలు తొలగించడంతో ఊహాగానాలకు మరింత బలం
  • త్వరలోనే వివాహం జరుగుతుందని స్పష్టం చేసిన పలాశ్ తల్లి అమిత
భారత మహిళా క్రికెట్ స్టార్ స్మృతి మంధాన, సంగీత దర్శకుడు పలాశ్ ముచ్చల్ వివాహంపై నెలకొన్న సందిగ్ధత కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా వాయిదా పడిన వీరి పెళ్లి గురించి సోషల్ మీడియాలో రకరకాల వదంతులు వ్యాపిస్తున్న వేళ, పలాశ్ తల్లి అమిత ముచ్చల్ స్పందించి కీలక ప్రకటన చేశారు.

నవంబర్ 23న జరగాల్సిన వీరి పెళ్లికి కొన్ని గంటల ముందు స్మృతి తండ్రి శ్రీనివాస్ గుండెపోటు లక్షణాలతో ఆసుపత్రిలో చేరడంతో వివాహాన్ని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు మంధాన మేనేజర్ ప్రకటించారు. అదే సమయంలో, స్మృతికి కాబోయే భర్త పలాశ్ కూడా తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన కారణంగా అనారోగ్యానికి గురయ్యారు. ఆయన ముంబయిలోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. వైద్యులు ఆయనకు మూడు వారాల విశ్రాంతిని సూచించారు.

ఇదిలా ఉండగా, స్మృతి తన సోషల్ మీడియా ఖాతా నుంచి పెళ్లికి సంబంధించిన ఫొటోలను తొలగించడం, పలాశ్‌కు సంబంధించినవిగా చెబుతున్న కొన్ని చాట్ స్క్రీన్‌షాట్లు వైరల్ కావడంతో వారి బంధంపై పలు ఊహాగానాలు మొదలయ్యాయి.

ఈ ప్రచారంపై ఇరు కుటుంబాలు ఇప్పటివరకు స్పందించనప్పటికీ, తాజాగా పలాశ్ తల్లి అమిత ఓ ఆంగ్ల పత్రికతో మాట్లాడుతూ ఈ వదంతులకు తెరదించే ప్రయత్నం చేశారు. స్మృతి, పలాశ్ ఇద్దరూ కష్టకాలంలో ఉన్నారని, ప్రస్తుతం అంతా బాగానే ఉందని పేర్కొన్నారు. వారిద్దరి వివాహం అతి త్వరలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. స్మృతి తండ్రి, పలాశ్ ప్రస్తుతం కోలుకున్నప్పటికీ.. సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణలపై వారి నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


More Telugu News