ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారా?.. రుజువు చూపండి: కుమారుడి డిమాండ్

  • జైల్లో ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ సోషల్ మీడియాలో వదంతులు
  • ఆరు వారాలుగా ఏకాంత నిర్బంధంలో ఉంచి కనీసం కలవనివ్వట్లేదన్న కాసిం ఖాన్
  • వదంతులను ఖండించిన అడియాలా జైలు అధికారులు
  • ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నారని స్పష్టీకరణ
పాకిస్థాన్ మాజీ ప్రధాని, అడియాలా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్ ఖాన్ మృతి చెందారంటూ కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో తీవ్రమైన వదంతులు వ్యాపిస్తున్నాయి. ఆఫ్ఘన్ కు చెందిన ఓ మీడియా కథనం ఆధారంగా ఈ ప్రచారం ఊపందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

ఈ నేపథ్యంలో ఆయన కుమారుడు కాసిం ఖాన్ స్పందిస్తూ, తన తండ్రి బతికే ఉన్నారని రుజువు చూపాలని, ఆయనను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా, అంతర్జాతీయ సమాజం, మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని కాసిం కోరారు.  

ఈ మేరకు కాసిం ఖాన్ ‘ఎక్స్’వేదికగా ఓ పోస్ట్ చేశారు. తన తండ్రిని జైలులో పెట్టి 845 రోజులైందని పేర్కొన్నారు.  గత ఆరు వారాలుగా ఆయనను ఓ డెత్ సెల్‌లో పూర్తి ఏకాంత నిర్బంధంలో ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఆయన సోదరీమణులను కూడా కలవనివ్వడం లేదని ఆరోపించారు. 

ఫోన్ కాల్స్ లేవు, మీటింగ్‌లు లేవు, ఆయన క్షేమ సమాచారం కూడా తెలియడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భద్రతాపరమైన చర్య కాదని, ఆయన పరిస్థితిని దాచిపెట్టేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కుట్ర అని ఆరోపించారు. తన తండ్రి భద్రతకు పాక్ ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని హెచ్చరించారు.

ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖానుమ్ కూడా ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. తమను కలవనివ్వకుండా గంటల తరబడి బయటే నిరీక్షింపజేస్తున్నారని ఓ ఇంటర్వ్యూలో ఆమె తెలిపారు.  

అయితే, ఈ వదంతులను అడియాలా జైలు అధికారులు గురువారం ఖండించారు. ఇమ్రాన్ ఖాన్ పూర్తి ఆరోగ్యంతో ఉన్నారని ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. ఆయన ఆరోగ్యం గురించి పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీ నాయకత్వానికి సమాచారం ఇచ్చామని తెలిపారు. ఇమ్రాన్‌ను వేరే జైలుకు తరలించారన్న వార్తలు కూడా పూర్తిగా నిరాధారమైనవని జైలు యంత్రాంగం పేర్కొంది. అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఇమ్రాన్ ఖాన్ ఆగస్టు 2023 నుంచి జైలు శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే.


More Telugu News